తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. అయితే.. మధ్యలో ఒకరోజు ఆదివారం వస్తుండటంతో.. 8 రోజులు సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు సభలో.. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణానికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సభ అనంతరం.. బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో.. సభ నిర్వహణ తేదీలు, ఎజెండాను ఖరారు చేశారు. ఇందులో భాగంగా.. 25న ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై.. బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు.
అదే రోజు (జులై 25న) అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే.. కాగా.. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో.. తమ సర్కారు ఏర్పడిన 7 నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించటంతో పాటు.. కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. 8 రోజులపాటు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం.. 31న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది.
కాగా.. ఈ సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ, విద్యా కమిషన్, రెవెన్యూతో పాటు పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా.. తెలంగాణ సమాజం మొత్తం ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రకటన, రైతు భరోసా విధివిధానాలపై చర్చ చేప్పట్టనుంది ప్రభుత్వం. వీటితో పాటు.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, గ్రూప్-1 నోటికేషన్ల జారీ అంశంపై సభలో చర్చించనున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల అమలు తీరుపై చర్చ చేపట్టనున్నారు. మరోవైపు.. రూ.2 లక్షల రుణమాఫీ అమలును కూడా రేవంత్ సర్కార్ వివరించనుంది.
మరోవైపు.. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అంశాలను కూడా ప్రభుత్వం చర్చకు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే.. మేడిగడ్డ బ్యారేజీపై కూడా ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక.. తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వ చిహ్నం రూపకల్పనపై కూడా సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకాకపోగా.. ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్ హాజరయ్యే అవకాశం ఉందని సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే.. ఆయన హాజరవుతారా.. లేదా.. అనేది మాత్రం తెలియాల్సి ఉంది. 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రోజు సభకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది.
ఓవైపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ కావటమే కాకుండా.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో.. కేసీఆర్ హాజరవుతారని వార్తలు రావటంతో.. ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటాన్ని ఎండగట్టటంతో పాటు.. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కూడా బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ పక్షం కూడా సభలో నిలదీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa