హైదరాబాద్‌లో చాలా మంది ఆంధ్రప్రదేశ్ వాసులు నివసిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఎక్కువగా కూకట్ పల్లి, మియాపూర్, లింగంపల్లి, బీహెచ్ఈఎల్, పటాన్ చెరు ప్రాంతాల్లో ఉంటారు. ఈ విషయాన్ని గుర్తించిన టీజీఎస్ ఆర్టీసీ.. విజయవాడకు వెళ్లే వారి కోసం.. ప్రత్యేకంగా రెండు కొత్త ఈ-గరుడ బస్సులు తీసుకొస్తోంది. అవి కూడా.. ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతూ వెళ్లకుండా.. అసలు ట్రాఫికే తగలకుండా నేరుగా ఓఆర్ఆర్ ఎక్కేసి డైరెక్ట్ విజయవాడ వెళ్లనున్నాయి. ఈ బస్సులు.. సోమవారం (సెప్టెంబర్ 30) నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు.
ఈ బస్సులు రామచంద్రాపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్, మలేషియన్ టౌన్షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మై హోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాంనగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడ వెళ్లనున్నట్టు తెలిపారు. ఇలా వెళ్లటం వల్ల.. విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి పూర్తి విముక్తి కలుగుతుందని శ్రీలత చెప్పారు. అయితే.. ఈ బస్సులు ప్రతిరోజూ రాత్రి తొమ్మిదిన్నరకు ఒకటి.. పదిన్నరకు మరొకటి.. రామచంద్రాపురం నుంచి బయలుదేరుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని విజయవాడ వెళ్లే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీలత విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే.. దసరా పండుగను, సెలవులను దృష్టిలో పెట్టుకొని టీజీఎస్ ఆర్టీసీ అందుకు తగ్గట్టుగా సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతోంది. విజయవాడలో కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో చాలా మంది అమ్మవారి దర్శనార్థం విజయవాడకు తరలివెళ్తుంటారు. మరోవైపు.. స్కూళ్లకు, కాలేజీలకు పండగ సెలవులు రానున్న నేపథ్యంలోనూ.. సొంత గ్రామాలకే కాదు నానమ్మలు, అమ్మమ్మల ఊర్లకు పెద్ద సంఖ్యలో పయనవుతుంటారు. దీంతో.. రద్దీ గణనీయంగా పెరుగుతుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని.. అక్టోబర్ 3 నుంచి 15వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించటం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa