ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫామ్ హౌస్‌లు కూల్చుతామనే పేదలను అడ్డుపెట్టుకొని ధర్నా చేస్తున్నారని విమర్శ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 03:18 PM

కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ రామచంద్రరావుకు చెందిన ఫామ్ హౌస్‌లను కూల్చేయవద్దా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిసినోళ్ల డ్రైనేజీ మొత్తం ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్‌లలో కలుస్తోందని, ఆ నీటిని ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు తాగాలా? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్ కార్డ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... వారి ఫామ్ హౌస్‌లను కూల్చుతామనే పేదలను అడ్డుపెట్టుకొని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు.మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు... మీ భరతం పట్టడం ఖాయమని హెచ్చరించారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చామని, డిసెంబర్‌లోపు మరో ముప్పై వేలమందికి ఇస్తామన్నారు. హైదరాబాద్‌లోని ట్రాఫిక్, వరద సమస్యను పరిష్కరించేందుకు తాము చర్యలు చేపడుతుంటే బావ, బావమరిది తమపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కిరాయి మనుషులతో వారు చేసే హడావుడిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు రూ.1,500 కోట్లు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయని, వాటి నుంచి రూ.500 కోట్లు మూసీ పరివాహక ప్రాంత పేద ప్రజలకు పంచి పెట్టాలని బీఆర్ఎస్‌ను డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు చెప్పులు కూడా లేని వారికి, ఇప్పుడు తమ పార్టీ ఖాతాలోకి మాత్రం రూ.1,500 కోట్లు వచ్చాయని విమర్శించారు.హైడ్రా విషయమై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ఆ రోజే సూచనలు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయం చెప్పాలని, వినేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని 15 వేల మందికి ఇళ్ల కేటాయింపుకు ఆదేశాలు ఇచ్చామన్నారు.హైడ్రా విషయమై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని, వచ్చి సలహాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇప్పటికే చిన్నపాటి వర్షానికే మునిగిపోతోందని, ఈ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేటీఆర్, హరీశ్ రావు సచివాలయానికి వస్తే చర్చించేందుకు సిద్ధమన్నారు. ఈటల రాజేందర్ నేతృత్వంలో నిధుల కోసం ప్రధాని నరేంద్రమోదీ వద్దకు వెళదామని సూచించారు. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా రావాలన్నారు. కేంద్రం నుంచి రూ.25 వేల కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa