ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రా కూల్చివేతలపై కీలక పరిణామం.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 06:49 PM

హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలే లక్ష్యంగా కూల్చివేతలు చేపట్టిన హైడ్రా.. నగరంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో భారీ ప్రకంపనలే సృష్టించింది. అయితే.. ఈ హైడ్రా కూల్చివేతల్లో సామాన్యులకు సంబంధించిన కలల సౌదాలు, స్థలాలు లీజుకు తీసుకుని బతుకుదెరువు కోసం పెట్టిన చిన్నా చితక కంపెనీలు ఉండటం ఇప్పుడు.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా.. ప్రతిపక్ష పార్టీలన్ని గళమెత్తాయి. బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ఎండగడుతుండటంతో పాటు క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు.


కేఏ పాల్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం (అక్టోబర్ 04న) విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలంటూ కేఏ పాల్‌ తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు. అయితే.. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపేయలేమని స్పష్టం చేసింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే కూల్చివేతలు ప్రారంభించాలంటూ హైకోర్టులో.. స్వయంగా కేఏ పాల్‌ తన వాదనలు వినిపించారు. ఒకవేళ అక్రమ కట్టడాలను గుర్తిస్తే.. వాటిని కూల్చివేసేందుకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కేఏ పాల్‌ తెలిపారు. జీవో నెంబర్ 99 మీద స్టే విధించాలని ధర్మాసనాన్ని కేఏ పాల్ కోరారు.


ఈ కేసులో.. ప్రతివాదులైన హైడ్రాతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 14వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో కూల్చివేతల్లో సామాన్యులు తమ ఇండ్లను కోల్పోయామంటూ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం మరోరకంగా చెప్తుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మీడియా ముందుకొచ్చి తమ ఇండ్లు కోల్పోయామని చెప్తున్న వాళ్లంతా.. బాధితులు కాదని నిందితులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. ఇదే అంశంపై రంగనాథ్‌ను హైకోర్టు ధర్మాసనం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతల విషయంలో అధికారులు పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారంటూ ప్రశ్నించింది. ఆదివారం రోజు అర్జెంటుగా కూల్చివేతలు చేపట్టాల్సిన అత్యవసరమేంటని నిలదీసింది. రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను మార్చేయాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించింది. నాయ్యస్థానం ఆగ్రహంతో.. పరిస్థితి కొంచెం సద్దుమణిగినట్టే కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa