బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన ప్రకటనతో.. సీఎం రేవంత్ రెడ్డి అసలు బండారం బట్టబయలైందంటూ కేటీఆర్ పెట్టిన పోస్టు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో రైతులందరికీ.. ఆగస్టు 15లోపు 2 లక్షల మేర రుణమాఫీ పూర్తిచేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తుండగా.. చాలా మందికి కాలేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రుణమాఫీపై నెలకొన్ని ఈ గందరగోళ పరిస్థితుల్లో మంత్రి నాగేశ్వర రావు చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
"20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది. వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం.. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ?? అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ?? చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపం." అంటూ కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇప్పటికే 22 లక్షలకు పైగా అన్నదాతలకు రుణమాఫీ పూర్తి చేశామని.. ఇంకా 20 లక్షల మంది రైతులకు ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ రుణాలు మాఫీ చేస్తామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. గురువారం (అక్టోబర్ 03న) మీడియాతో తెలిపారు. అయితే.. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు, బీఆర్ఎస్ పార్టీల నాయకులు రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొల్పుతున్నారని మంత్రి మండిపడ్డారు. వాళ్ల రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం.. ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని.. తద్వారా అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోందంటూ తుమ్మల చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa