బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీకి కాదు.. చంద్ర మండలానికి వెళ్లి ఫిర్యాదు చేసినా తప్పు చేస్తే అరెస్ట్ అవడం ఖాయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వేములవాడ గుడిచెరువులో ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ... భూసేకరణపై కుట్ర చేసినందుకు ఊచలు లెక్కపెడతారని హెచ్చరించారు.డ్రగ్స్ తీసుకున్న వారు ఇంట్లో దొరికితే కేసు పెట్టకూడదా? తన బావమరిది తాగి తందనాలు ఆడితే కేటీఆర్ ఎలా సమర్థిస్తారు? విదేశీ మద్యం దొరికితే కేసు పెట్టవద్దా? కేటీఆర్ ఉరుకులాటలు (పరుగులు) గమనిస్తూనే ఉన్నామని, ఎంత దూరం ఉరుకుతారో చూస్తానన్నారు. తన నియోజకవర్గంపై కేసీఆర్‌కు ఎందుకంత కక్ష అన్నారు. తానేమీ లక్షల ఎకరాలు సేకరించడం లేదని, నాలుగు గ్రామాల్లో 1,100 ఎకరాలను మాత్రమే సేకరిస్తున్నామన్నారు.భూసేకరణ చేసి... పరిశ్రమలు తెచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కేసీఆర్‌కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా భూసేకరణ జరిగిందని గుర్తు చేశారు. భూమిని కోల్పోతున్న రైతులకు మూడు రెట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేసీఆర్‌కు తాను చెప్పేది ఒకటేనని... అసెంబ్లీకి రావాలని... అక్కడ అన్ని లెక్కలు చెబుతామన్నారు. 80 వేల పుస్తకాలు చదివావో కూడా మాట్లాడుదామని ఎద్దేవా చేశారు. రుణమాఫీ లెక్కలు కూడా చెబుతామన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదని విమర్శించారు.తాము ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్కటి తక్కువ ఇచ్చినట్లు నిరూపించినా తాను అక్కడే క్షమాపణ చెబుతానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేటీఆర్, హరీశ్ రావు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు తాము చేస్తుంటే నొప్పి వస్తోందన్నారు. మీ నొప్పికి మా కార్యకర్తల వద్ద మందు ఉందని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగతి తేలుస్తామన్నారు. ఎన్నో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు.