జగదేవపూర్ మండలం తిగుల్ నర్సాపూర్ సమీపంలోని కొండ పోచమ్మ ఆలయం 23వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబయింది. ఈ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 20వ తేదీ బుధవారం నుండి ప్రారంభమై 22వ తేదీ శుక్రవారం రోజున ముగుస్తాయి. భక్తుల కోరికలు తీర్చే తల్లిగా విరాసిల్లుతున్న ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొండపోచమ్మ తల్లి కొమురవెల్లి మల్లికార్జున స్వామి కి స్వయానా చెల్లెలుగా చెబుతుంటారు. కొండపోచమ్మకు ప్రతిఏటా కార్తీక మాసములో వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజు వస్తుంటారు. ఈ వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. 23 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు.
రోజువారీ పూజా కార్యక్రమాలు....
ఆలయం వద్ద మూడు రోజులపాటు విశేష పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. బుధవారం గణపతి పూజ, పుణ్య హవచనం, అఖండ దీప స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, మూత్రమంత్ర హవనము, అభిషేకము నిర్వహిస్తారు. గురువారం ప్రాతకాల పూజ, మూలమంత్ర హోమం, స్థాపితా దేవతా పూజ, సామూహిక కుంకుమార్చన, మంగళ హారతి వంటి కార్యక్రమాలు ఉంటాయి. శుక్రవారం శివపార్వతుల కళ్యాణం ఉంటుంది.
కొండ పోచమ్మ 23వ వార్షికోత్సవ వేడుకలకు ఆలయాని అందంగా ముస్తాబు చేశామని ఈఓ రవి కుమార్ తెలిపారు. ఆలయానికి రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగిందన్నారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.