ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబరు 8న ఏఐ సిటికీ భూమిపూజ.. ప్రజా పాలన విజయోత్సవాల షెడ్యూల్ ఇదే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 10:01 PM

గతేడాది తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తికావస్తున్నందున ‘ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు 2024’నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐ సిటీకి భూమి పూజ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పరిశ్రమలను శాఖకు ఆదేశాలు జారీచేసింది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 1 నుంచి 9 వరకూ ఘనంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఏరోజు ఏయే కార్యక్రమాలను నిర్వహించాలనే షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. ఈ 9 రోజుల్లో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.


ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తోన్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సిటీ’ శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించారు. ఈ సిటి నిర్మాణానికి డిసెంబరు 8న భూమి పూజ చేయనున్నారు. 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ఏఐ సిటిలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన ఆఫీస్‌ స్పేస్‌ నిర్మాణాకి వరల్డ్ ట్రేడ్‌ సెంటర్‌ (డబ్ల్యూటీసీఏ) ఇప్పటికే ముందుకొచ్చింది. భవిష్యత్తులో ఈ సిటీ ప్రపంచానికే ప్రతీకగా నిలుస్తుందని, ఏఐలో ఆవిష్కకర్తలకు నిలయంగా మారుతుందని తెలంగాణ సర్కారు బలంగా విశ్వసిస్తోంది.


ఐటీ ఎగుమతుల లక్ష్యాలను వేగవంతం చేయడంతో పాటు రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో ఏఐ సిటీ దోహదపడుతుందని, రాబోయే రోజుల్లో వందల కంపెనీలు ఇందులో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇది మొదటి అడుగుగా సర్కారు భావిస్తోంది. ఏఐ సిటీలో సైబర్‌ సెక్యూరిటీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్‌ల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలు కూడా రానున్నాయి. ప్రపంచస్థాయి క్యాంపస్‌లు, వాణిజ్య సేవలు, ట్రెయినింగ్ ఫెసిలిటీస్, విలాసవంతమైన హోటళ్లు, వినోద జోన్లు, నివాస గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటివి కూడా ఉండేలా ఏఐ సిటీకి రూపకల్పన చేశారు.


డిసెంబరు 1.. విద్య శాఖ


రెండో దశ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు శంకుస్థాపనః విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు, సీఎం కప్‌ క్రీడా పోటీల ప్రారంభం. ఇవి డిసెంబరు 8 వరకు జరుగుతాయి.


డిసెంబరు 2. వైద్యం, ట్రాఫిక్‌ అంశాలు


16 నర్సింగ్, 28 పారా మెడికల్‌ కాలేజీలు, 213 కొత్త అంబులెన్సులు, 33 ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌లు ప్రారంభిస్తారు. ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్ల కోసం పైలట్‌ ప్రాజెక్టు


డిసెంబరు 3. అభివృద్ధి పనుల ప్రారంభం


హైదరాబాద్‌ రైజింగ్‌ కార్యక్రమాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లైఓవర్‌, రూ.150 కోట్ల విలువైన సుందరీకరణ పనులు ప్రారంభం


డిసెంబరు 4.. అటవీశాఖ కార్యక్రమాలు


తెలంగాణ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన, వర్చువల్‌ సఫారీ, వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం. అటవీ శాఖలో 9,007 మందికి నియామక పత్రాల అందజేత


డిసెంబరు 5.. మహిళాభివృద్ధి.


ఇందిరా మహిళా శక్తి బజార్‌ ప్రారంభం, స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు, మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు, ఘట్‌కేసర్‌లో బాలికల ఐటీఐ కాలేజీ ప్రారంభం


డిసెంబరు 6.. విద్యుత్‌ రంగం.


యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం, 244 విద్యుత్‌ ఉపకేంద్రాల శంకుస్థాపన


డిసెంబరు 7.. విపత్తు నివారణ


స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ప్రారంభం, పోలీస్‌ బ్యాండ్‌ ప్రదర్శన, తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలై మూడురోజుల పాటు కొనసాగుతాయి.


అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి క్రేజ్.. అభిమానం మామూలుగా లేదుగా..


డిసెంబరు 8.. స్పోర్ట్స్‌ వర్సిటీ..


ఏఐ సిటీకి భూమి పూజ, 7 ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్టులు, 130 కొత్త మీ సేవల ప్రారంభం.. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన


డిసెంబరు 9.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ


లక్షల మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, ట్యాంక్‌ బండ్‌ మీద ముగింపు వేడుకలు, డ్రోన్‌ షో, ఫైర్‌వర్క్స్, ఆర్ట్‌ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు చేయనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa