ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టూ ఓ కారణం: సీనియర్ సైంటిస్ట్ బీవీ సుబ్బారావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 08:08 PM

తెలుగు రాష్ట్రాల్లో నేడు ఉదయం సంభవించిన భూ ప్రకంపనలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. ఉదయం 7.25 గంటల ప్రాంతంలో ఓ రెండు నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంతో పాటుగా.. తూర్పు తెలంగాణలోని చాలా జిల్లాల్లో భూమి కంపించింది. ఏపీలోని కొన్ని జిల్లాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ములుగు జిల్లా మేడారనికి దగ్గర్లోని ఐలాపూర్‌కు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా ఉంది. భూమికి 40 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు మెుదలయ్యాయని సైంటిస్టులు వెల్లడించారు.


ఈ భూ ప్రకంపనలు రావటానికి సెంటిస్టులు రకరకాల కారణాలు చెబుతున్నారు. ములుగు ప్రాంతంలో.. సింగరేణి గనుల తవ్వకం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందువల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయని చెబుతున్నారు. దాంతో పాటుగా ఆ ఏరియా గోదావరి నది పరివాహాక ప్రాంతమని.. నీరు పారే చోట భూమిలో మెుత్తదనం ఏర్పడి ఉంటుందని పేర్కొంటున్నారు. గోదావరి జలాల వల్ల భూమిలో గట్టిదనం తగ్గిపోయి.. మెత్తగా మారడం వల్ల భూమి కదలికలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. అందుకే ఈ భూకంప ప్రకంపనలు ఇన్ని చోట్లకు రాగలిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టు సైతం భూకంపానికి కారణంగా సీనియర్ భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాటర్ స్టోర్ చేయటం వల్ల ఒత్తడి పెరిగి ఇటువంటివి జరుగుతాయని అంటున్నారు. డిజాస్టర్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టకూడదని.. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ప్రాంతం మెుత్తం డిజాస్టర్‌కు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రం సైతం వెల్లడించిందని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూమిలో నీరు బాగా పెరిగిందన్నారు. ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో.. భూమిలో ఫలకాల కదలికలు తేలిక అవుతాయని అన్నారు. వీటి ద్వారా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.


భూకంపకేంద్రంగా చెబుతున్న ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో ఈ ఏడాది ఆగస్టు 31న టోర్నడో తరహా గాలి దుమారం చెలరేగి అరణ్యంలో సుమారు 60 వేల చెట్లు కూలిపోయాయి. ఇదే ప్రాంతం కేంద్రంగా ఇప్పుడు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడికి సమీపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మించారు. సైంటిస్టు సుబ్బారావు వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడివన్నీ చర్చనీయాంశంగా మారాయి.


అటు ఏపీలోని విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని కొండలను.. నిర్మాణాలకు అవసరమైన కంకర కోసం అతిగా తోడేస్తుండటం పట్ల కూడా సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిలోని సహజ వనరులను అతిగా ధ్వంసం చేస్తే ఇలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో.. భూ స్వభావానికి సంబంధించిన టెక్నికల్ అంశాలను విస్మరించకూడదని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆయన కోరారు.


తెలంగాణలో మళ్లీ భూకంపం వస్తుందా..?ఇక తెలంగాణలో భూ ప్రకంపనలు రావడంపై ఎంజీఆర్ఐ అధికారి డాక్టర్ శేఖర్ సైతం స్పందించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పారు. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. 1969 లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 రిక్టర్ స్కేలుపై భూకంపం వచ్చిందని గుర్తు చేశారు. ప్రజలెవరూ భయాందోళనకు గురి కావొద్దని సూచించారు. పగుళ్లు ఉన్నటువంటి బిల్డింగ్స్ పాత భవనాలలో ఉండకపోవటం మంచిదని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa