పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతన్ లో గీతా జయంతిని వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణుని విగ్రహానికి గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ - కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ లు పూలమాల వేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి, సందిగ్దతకి సమాధానంగా భగవద్గీత ఈ నాటికీ, ఏ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేసిన పలువురు విజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం తమ ఆవిష్కరణలకు ప్రేరణ భగవద్గీత లోని కొన్ని వాక్యాలే అని చెప్పడం భగవద్గీత యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుందన్నారు. ఇది సుమారు 5500 సంవత్సరాల పూర్వం ఉపదేశించబడినా కూడా ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గంలో నడిపిస్తుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. కాబట్టి విద్యార్థులంతా గీతా పారాయణం చేయడం వల్ల ఎన్నో గొప్ప విషయాల పట్ల జ్ఞానం పొంది, మంచి మార్గం లో జీవితాన్ని సాగించడానికి దోహదపడుతుందని అన్నారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన గ్రంథం గా భావించకుండా, మన జీవన గమనం లో గొప్పగా రాణించడానికి ఇందులో శ్రీ కృష్ణ భగవానునిచే చెప్పబడిన ఉపదేశాలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు.
అందువల్లనే భగవద్గీత పుట్టిన రోజుని మనం గీతా జయంతిగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభ చూపిన పూరెల్ల హన్విత (9వ తరగతి), కొమురవెల్లి కార్తీక్ (7వ తరగతి) లకు ఛైర్మన్ దంపతులు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆలపించిన భగవద్గీత శ్లోకాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి. అనంతరం తక్కువ సమయంలోనే ఎక్కువ మంది విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసి, రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చూపడంలో విశేష కృషి చేసిన ఉపాధ్యాయురాళ్ళు సృజన, శాంత లక్ష్మి, రాజమణి లను శ్రీనివాస్ - రజనీ దేవి దంపతులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.