ఆదిలాబాద్ జిల్లా బేల మండలం తోయిగూడ గ్రామస్తులు నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకున్నారు. జైనథ్ మండలం సాత్నాల వద్ద 1984లో ప్రభుత్వం ఓ ప్రాజెక్టును నిర్మించింది. ప్రాజెక్టు కట్టే సమయంలో ముంపులో భాగంగా తోయగూడ అనే గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సొంతూర్లో ఇళ్లు, భూములు కోల్పోయిన ఆ గ్రామస్తులు బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడో స్థిరపడ్డారు.
దేశంలోని నలుమూలల్లో స్థిరపడిన తోయిగూడ గ్రామస్తులు సొంతూరిపై ప్రేమలో నలభై ఏళ్ల తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. యువకులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆత్మీయ సమ్మేళనానికి ప్లాన్ చేశారు. దాంతో నాలుగు దశాబ్దాల తర్వాత 500 మందికి పైగా తోయగూడ గ్రామ శివారులో కలుసుకుని, ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మంచిచెడులు మాట్లాడుకున్నారు.
ముంపులో మునిగిపోగా మిగిలిన ఆనవాళ్లను తమ బిడ్డలకు చూయిస్తూ ఆరోజులను గుర్తు చేసుకున్నారు. ఊర్లో బావి, చదువుకున్న బడి ఆనవాళ్లను తమ పిల్లలకు చూయించారు. మహిళలంతా బతుకమ్మ ఆడారు. మైసమ్మ, పోచమ్మ, హనుమాన్ మందిరాలను డప్పు చప్పుళ్లతో దర్శించుకుని పూజలు చేశారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఆడిపాడారు. చివరికి అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు.
![]() |
![]() |