మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికి నల్లగొండ నియోజకవర్గ ప్రజల కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తానని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ రోజు శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి వివిధ ప్రాంతాల నుంచి సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఆర్ధిక ఇబ్బందులతో కాలేజీ ఫీజులు కట్టలేక, ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చినవారికి మానవత్వంతో వారి సమస్యలు పరిష్కరించి.. వారి మోముల్లో సంతోషం నింపారు. రాష్ట్ర కెబినేట్ మంత్రిగా రాష్ట్రవ్యాప్త బాధ్యతలతో ఈ మధ్య ప్రజావాణి కార్యక్రమం కొంత ఆలస్యం జరిగిందన్న మంత్రి.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమానికి అధికారులను ఎవరిని పిలవలేదని పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రివర్యులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.... హైదరాబాద్ చుట్టూరా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణంతో తెలంగాణ రాష్ట్ర ప్రగతి మరో మెట్టు ఎక్కుతుందని ఆయన అన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు పనులకు ఉత్తర భాగానికి టెండర్లు పిలిచామని, దక్షిణ భాగానికి సంబంధించి డీపీఆర్ కు టెండర్లు పిలవడం జరిగిందన్న మంత్రి త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. గతంలో వైయస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడం దానికి దగ్గర్లోనే రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా నగరం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు 13 కిలోమీటర్లు పొడవైన పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ కట్టిన తర్వాత హైదరాబాద్ కు మల్టీనేషన్ కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. బెంగళూరులో ఎయిర్ ఫోర్ట్ నుంచి ఐటీ కంపెనీలకు వెళ్లాలంటే ట్రాఫిక్ వలన రెండు మూడు గంటల సమయం పడుతుందని తెలిపిన మంత్రి. హైదరాబాదులో అలాంటి సమస్య తలెత్తకుండా.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు
గత ఎన్నికల ముందు కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డును కమిషన్ కోసం అమ్ముకున్నాడని విమర్శించిన మంత్రి.. రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించాల్సి ఉన్న నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు నడము నిర్మిస్తున్న రేడియల్ రోడ్స్ తో తెలంగాణ రూపురేఖలు మారడంతో పాటు హైదరాబాదు ట్రాఫిక్ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని మంత్రి తెలిపారు.
దశాబ్ధాల నల్లగొండ జిల్లా సాగు, త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు శ్రీశైలం టన్నెల్ బేరింగ్ మిషన్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపిన మంత్రి.. అమెరికా నుంచి రాబిన్స్ బోరింగ్ కంపెనీ నుంచి వచ్చే మరో బేరింగ్ మిషన్ మద్రాసు పోర్టు వరకు వచ్చిందని తెలిపారు. రెండు సంవత్సరాల్లో శ్రీశైలం సొరంగం మార్గం పనులను పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం టన్నెల్, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. కెసిఆర్,కేటీఆర్ లతో పాటు కొంతమంది కులగణలో పాల్గొనకపోవడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. రాష్ట్ర పౌరులుగా అందరూ సర్వేలో పాల్గొనలని హితవు పలికారు. ఐదుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నల్లగొండ నియోజక వర్గ ప్రజలకు తాను ఎల్లవేళల రుణపడి ఉంటానన్న మంత్రి.. ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నల్లగొండ సమగ్రాభివృద్దే తన ధ్యేయమని పేర్కొన్నారు. అన్ని రంగాలలో నల్లగొండలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఇప్పటికే నల్లగొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించామని అవన్నీ పూర్తయిన తర్వాత నల్లగొండ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa