నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనుల్లో ప్రమాదం జరగడం తెలిసిందే. ఈ నెల 22న ఉదయం టన్నెల్ పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా సొరంగం పైకప్పు కూలిపోయి, 8 మంది అందులోనే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి మూడ్రోజులు కావడంతో టన్నెల్ లో చిక్కుకున్న వారి పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఘటన స్థలి వద్ద నలుగురు మంత్రుల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా, రెస్క్యూ టీమ్ లు 13.7 కి.మీ వరకు చేరుకున్నాయి. టన్నెల్ 10.95 కి.మీ వద్ద ఒకటిన్నర అడుగు నీరు నిలిచి ఉన్నట్టు గుర్తించారు. 11.9 కి.మీ వద్ద రెండు అడుగుల మేర నీటి ప్రవాహం ఉన్నట్టు గుర్తించారు. 13వ కి.మీ వద్ద టన్నెల్ బోరింగ్ మెషీన్ వెనుక పరికరాలు దెబ్బతిన్నాయి. బోరింగ్ మెషీన్ వెనుకభాగంలో బురద పేరుకుపోవడంతో కన్వేయర్ బెల్ట్ పనిచేయడంలేదు.
14వ కిలోమీటరు మరో 100 మీటర్ల దూరంలో ఉందనగా 6 అడుగుల ఎత్తులో మట్టి, రాళ్లతో పూడిక ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. టన్నెల్ లో చిక్కుకుపోయిన 8 మంది 14వ కిలోమీటరు వద్దే ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎండోస్కోపిక్ రోబోటిక్ పుష్ కెమెరాలు తీసుకెళ్లినా, పూడిక కారణంగా ప్రయోజనం కనిపించలేదు. బోరింగ్ మెషిన్ దెబ్బతినడంతో పుష్ కెమెరా టీమ్ లు ముందుకెళ్లలేక ఆగిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa