2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నేడు (మార్చి 10న) నల్గొండ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 అయిన మారుతీ రావు ఆత్మహత్య చేసుకోవటంతో.. మిగిలిన నిందితులకు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఏ2కు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం.. మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే.. 2018లో ఈ హత్య జరిగినప్పుడు.. ప్రస్తుతం హైడ్రా కమిషనర్‌గా ఉన్న రంగనాథ్ నల్గొండ ఎస్పీగా ఉన్నారు. దీంతో.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసును రంగనాథ్ ప్రత్యేకంగా డీల్ చేశారు. కేవలం మూడు రోజుల్లోనే కేసును చేధించారు.
అయితే.. ప్రస్తుతం ఈ కేసులో ఏడేళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. తనకు అండగా నిలిచి, భరోసా ఇచ్చిన రంగనాథ్‌ను.. ప్రణయ్ భార్య అమృత గుర్తుచేసుకుంది. నేరస్థులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అప్పుడు ఆయన ఇచ్చిన మాట నేడు నెరవేరటంతో.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు రంగనాథ్‌కు నేరుగా ఫోన్ చేసింది అమృత.
అసలైన నేరస్థులకు శిక్ష పడుతుందని ఆరోజు చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ రంగనాథ్‌తో అమృత చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. ఆరోజు ఎదురైన సవాళ్లు, ఒత్తిళ్లకు లొంగకుండా కఠినంగా, నిజాయితీగా వ్యవహరించటం వల్లే ఈరోజు న్యాయం జరిగిందంటూ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా అమృత భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో.. అమృతతో మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని మీరు నమ్మారని.. అందుకు తగ్గట్టుగానే తీర్పు వచ్చిందని రంగనాథ్ తెలిపారు. ముందు నుంచి తమపై నమ్మకం ఉంచినందుకు అమృతకు ఏవీ రంగనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కేసు విషయమై రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రణయ్ హత్య కేసులో అన్ని కోణాలు ఉన్నాయని తెలిపారు. ఇది ఒక పరువు హత్యే అయినా.. కాంట్రాక్ట్ కిల్లర్లతో మర్డర్ చేపించటంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి తెలివిగా వ్యవహరించారని రంగనాథ్ వివరించారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉందని.. మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదంటూ బుకాయించాడని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. దర్యాప్తు ప్రారంభించిన 3 రోజుల్లోనే కేసును ఛేదించినట్టు ఆనాటి సంగతులను రందనాథ్ తెలిపారు. కోర్టు వెలువరించిన తీర్పుతో తాను సంతృప్తిగా ఉన్నానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa