ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేదార్‌నాథ్‌ యాత్రికులకు సిద్దిపేట చెందిన సేవా సమితి వితరణ,,,ఉచితంగా మూడు పూటలా భొజనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 08:15 PM

ప్రస్తుతం చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి యాత్రికులు.. కేదార్‌నాథ్ మహా శివుడిని దర్శించుకునేందుకు వెళ్తూ ఉంటారు. అయితే కేదార్‌నాథ్ వెళ్లడం అంత సులువైన పని కాదని అందరికీ తెలిసిందే. వాతావరణ పరిస్థితులకు తోడు.. అక్కడికి చేరుకునే మార్గం ఎంత క్లిష్టంగా ఉంటుందో వెళ్లి వచ్చిన వారికే తెలుస్తుంది. ఇక చాలా మంది గుర్రపు స్వారీ, డోలీల ద్వారా మంచు కొండలు ఎక్కి దర్శనాలు చేసుకుంటారు. అయితే ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వెళ్లిన వారికి అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఆకలి. ఇక ఇలాంటి యాత్రికుల ఆకలి తీర్చేందుకు గత కొన్నేళ్లుగా తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి ప్రతీ సంవత్సరం కేదార్‌నాథ్ యాత్ర సమయంలో అక్కడ అన్నదానం నిర్వహిస్తోంది.


ఇక అలాంటి చోట మన ఇంటి భోజనం దొరకడం గగనమే. కానీ కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి.. ఆ బాధను తీర్చుతోంది. ఏడాదిలో 3 నెలలు మాత్రమే కేదార్‌నాథ్ దర్శనం ఉంటుంది. అయితే 2019లో తొలిసారి కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి.. అక్కడ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కరోనా మహమ్మారి సమయంలో రెండేళ్ల విరామం మినహాయిస్తే ప్రతీ సంవత్సరం అక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ ఐదోసారి అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తుండగా.. 2 నెలల పాటు కొనసాగనుంది. 30 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితిలో ప్రస్తుతం 116 మంది ఉన్నారు. అందులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సహా పలువురు భాగస్వాములుగా ఉన్నారు.


ఇక ఈ అన్నదాన శిబిరం తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సేవలు అందిస్తుంటుంది. ఇక అన్ని వేళల్లో టీ, కాఫీ, టోస్ట్‌లు, బిస్కెట్లు లభిస్తాయి. ఉదయం టిఫిన్ల కింద ఇడ్లీ, వడ, పూరీ, దోశ, పొంగల్, మైసూర్‌బోండా, అటుకులు, ఉప్మా, చపాతి, పరోటాలను అందిస్తారు. ఈ టిఫిన్‌ సమయం ఉదయం7 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత భోజనం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వడ్డిస్తారు. ఇక సాయంత్రం 4.30 గంటల నుంచి స్నాక్స్ కింద సమోసా, కట్‌లెట్, బేల్‌పూరి, ఫింగర్‌ చిప్స్, పానీపూరీ అందిస్తారు. ఇక రాత్రి 12 గంటల వరకు భోజన వసతి ఉంటుంది. భోజనంలో రకరకాల వంటకాలను పెడతారు. ఆవకాయ పచ్చడి, అన్నం, కుర్మా, పప్పు, సాంబారు, పెరుగు, పాపడ్, చల్ల మిర్చి, స్వీట్‌తో కూడిన భోజనాన్ని కేదార్‌నాథ్ యాత్రికులకు వడ్డిస్తారు.


ఈ అన్నదాన శిబిరంలో అల్పాహారం, భోజనంతో పాటు రాత్రి పూట విశ్రాంతి తీసుకునేందుకు 100 మందికి వసతి కూడా కల్పిస్తున్నారు. ప్రతీ సంవత్సరం లక్షలాది భక్తులకు వీరు సేవలు అందిస్తున్నారు. ఉత్తరాఖండ్ సోన్‌ప్రయాగ్‌ సమీపంలో శిరైషి - రాంపూర్‌ మధ్య ఒక శిబిరం.. కేదార్‌నాథ్‌ ఆలయానికి 100 అడుగుల దూరంలో మరో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సభ్యులతోపాటు మరో 60 మంది సిబ్బంది నిత్యం వివిధ షిఫ్ట్‌లలో పని చేస్తుంటారు. ఇందుకోసం సిద్దిపేట నుంచి 10 మంది వంట మనుషులు.. ఢిల్లీకి చెందిన మరో 20 మంది సిబ్బందిని నియమించారు. స్వచ్ఛ సిద్దిపేట ఆదర్శంగా అధిక శాతం స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులను వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా కొన్ని అత్యవసర మందులను కూడా సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. అంతేకాకుండా కేదార్‌నాథ్ వెళ్లిన వారు సాయం పొందేందుకు ఫోన్ నంబర్లను కూడా కేటాయించారు. 9949930005, 9246932267, 9848124031, 9440777741 నంబర్లకు ఫోన్ చేసి కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి సేవలను పొందవచ్చు.


కేదార్‌నాథ్‌ ఆలయానికి చేరుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. ఓ సాహసమే చేయాల్సి ఉంటుంది. సోన్‌ప్రయాగ్‌ వరకు వాహనాల్లో వెళ్లొచ్చు. ఆ తర్వాత సుమారు 5 కిలోమీటర్ల మేర గౌరీముండ్‌ వరకు ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ఆ తర్వాత మరో 21 కిలోమీటర్ల దూరం కాలినడకన, డోలీలు, గుర్రాలు, ఇతర రూపాల్లో ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. కేదార్‌నాథ్ దర్శించుకునే మొత్తం యాత్రికుల్లో 60 శాతం మేర భక్తులు దక్షిణ భారతదేశం నుంచి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa