గ్రామ పంచాయతీ లే ఔట్లే లక్ష్యంగా కబ్జాల పర్వం కొనసాగుతోంది. ఒకప్పుడు నగర శివార్లుగా ఉన్న భూముల్లో వేసిన పంచాయతీ లే ఔట్లకు రక్షణ లేకుండా పోయిందంటూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. రహదారులు, పార్కుల హద్దులను చెరిపేసి వ్యవసాయ భూములుగా మార్చేశారంటూ వాపోతున్నారు. ఇదేమని అడిగితే పాసు పుస్తకాలు చూపించి ఈ భూములు మావంటూ వెళ్లగొడుతున్నారని ఫిర్యాదు చేశారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 64 ఫిర్యాదులు రాగా.. అందులో 60 శాతానికి పైగా పాత లే ఔట్లపైనే ఉన్నాయి. అలాగే పార్కులు, రహదారుల కబ్జాలపైనా ఫిర్యాదులందుతున్నాయి. వీటిని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు గూగుల్ మ్యాప్స్ ద్వరా పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలను అప్పగించారు. అలాగే క్షేత్ర స్థాయిలో పరిశీలనకు సమయమిచ్చారు. అధికారికంగా రివైజ్ చేయని పక్షంలో పాత లే ఔట్ ప్రకారమే రహదారులు, పార్కులుంటాయని స్పష్టం చేశారు. ఫిర్యాదులను లోతుగా పరిశీలించి.. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం, కొర్రెముల గ్రామం, 739 నుంచి 749 వరకూ ఉన్న సర్వే నంబర్లలో మొత్తం 149 ఎకరాల మేర ఉన్న ప్రొ. జయశంకర్ ఏకశిలా కాలనీ లే ఔట్ 1987లో మొత్తం 2080 ప్లాట్లతో వేశారు. ఇందులోని నాలుగు సర్వే నంబర్లలో 47 ఎకరాల భూమి మాదంటూ ఆలూరి వెంకటేష్ తో పాటు మరికొందరు పాసుపుస్తకాలు సంపాదించి కబ్జా చేశారని బాధితులు వాపోయారు. రిట్ పిటిషన్ 8859/2009 ద్వారా లే ఔట్‌ను బతికించుకున్నా.. మళ్లీ 7 ఎకరాలు ధరణి ద్వారా పాస్ పుస్తకం తెచ్చుకుని తమను అడ్డుకుంటున్నారని ప్రజావాణి ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్దంబర్పేట 264, 265, 266 సర్వే నంబర్లలో 500 ప్లాట్లతో శ్రీ బాలాజీ నగర్ కాలనీ పేరిట ఉన్న లే ఔట్ తర్వాత శ్రీ సాయినగర్ కాలనీ లే ఔట్‌గా మారిపోయిందని పాత లేఔట్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రిట్ పిటిషన్ 33331/2018 ద్వారా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఇందులోని 40 అడుగుల ప్రధాన దారిని మూసేయడంతో ఔటర్ రింగురోడ్డును, విజయవాడ హైవేకు దారి లేకుండా అయ్యిందని పేర్కొన్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం రెడ్డి ఎన్‌క్లేవ్‌లో 2460 గజాల పార్కు స్థలం ఉంటే.. అందులో 667 గజాల స్థలాన్ని కబ్జా చేశారని ఆ కాలనీ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఉన్నా కబ్జా జరిగిపోయిందని వాపోయారు. మొత్తం 10 ఎకరాల వరకూ ఉన్నలే ఔట్లో 200ల ప్లాట్లుండగా.. పార్కు లేకుండా అయ్యిందన్నారు. పార్కు స్థలంపై కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. కబ్జాదారుడిని ఖాళీ చేయించడం ఎవరి తరం కావడంలేదని పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ వాళ్లు పార్కుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
మెహిదీపట్నం - మల్లేపల్లి మార్గంలోని ఆసిఫ్‌నగర్‌లో దర్గా భూమిని కూడా కబ్జాదారులు వదలడంలేదని మొత్తం 3800 గజాల స్థలం తనదని.. అప్సర్ అహ్మద్ అనే వ్యక్తి కబ్జా చేశారంటూ దర్గా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. భవన అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరిగిపోతున్నాయని వాపోయారు. ఆ భూమి నుంచి ఖాళీ చేయాలని జీహెచ్ ఎంసీ నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని.. ధర్గా భూమిని కాపాడాలంటూ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని 93, 94 సర్వే నంబర్లలో 3620 గజాల పార్కు స్థలాన్ని కాపాడాలంటూ టి. నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. 16 ఎకరాల పరిధిలో 148 ప్లాట్లతో 1966లో టీ నగర్ లే ఔట్ వేయగా.. పార్కు స్థలం ఇదొక్కటే ఉండగా.. శ్రీనివాస చౌదరి కబ్జా చేశారంటూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa