ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్‌లో అలాంటి చాట్స్ వస్తున్నాయా..?, రాచకొండ పోలీసుల హెచ్చరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 06:34 PM

సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా యువకులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కొత్త రకం సైబర్ మోసాలపై రాచకొండ పోలీసులు ప్రజలను మరోసారి హెచ్చరించారు. 'పెళ్లి' లేదా 'సహజీవనం' వంటి ప్రలోభాలతో ట్రాప్ చేసి వారి నుంచి డబ్బు దోచుకోవడం, బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటి సంఘటనలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సైబర్‌ నేరాలపై అప్రమత్తత కోసం రాచకొండ పోలీస్‌ అధికారులు తమ అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా ఆదివారం ఒక కీలక సందేశాన్ని, దానికి సంబంధించిన అవగాహన వీడియోను విడుదల చేశారు.


'వాట్సాప్‌లో వల వేస్తున్న కిలాడీ లేడీలు... పెళ్లి, సహజీవనం పేరుతో విసిరే వలకు జాగ్రత్త! సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని, నమ్మకం పొందిన తర్వాత డబ్బు వసూలు చేయడం, బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటి మోసాలు జరుగుతున్నాయి. ఈజీ మనీ కోసం కొందరు మహిళలు ఇలా ట్రాప్ చేస్తున్నారు. సందేహాస్పద నంబర్ల నుండి వచ్చే కాల్స్‌, చాట్స్‌కి స్పందించకండి. మోసం జరిగితే వెంటనే సైబర్‌ క్రైమ్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 1930 లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించండి.' అని రాచకొండ పోలీసులు ట్వీ్ట్ చేశారు.


ఈ మోసపూరిత వలలో చిక్కుకున్న అనేక మంది యువకులు తమ డబ్బును కోల్పోవడంతో పాటు, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పోలీసులు గుర్తించారు. ఆకర్షణీయమైన ప్రొఫైల్‌ చిత్రాలతో సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్‌ల ద్వారా యువకులతో కొందరు అమ్మాయిలు పరిచయం చేసుకుంటారని తెలిపారు. తమ మాటలతో, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ వారితో బలమైన నమ్మకాన్ని పెంచుకుంటారని.. పరిచయం దృఢపడిన తర్వాత, ఏదో ఒక కారణం చెప్పి ఆర్థిక సహాయం అడగడం లేదా వారిని వీడియో కాల్స్‌లోకి లాగి ఆ వ్యక్తిగత క్షణాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. త్వరగా, సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే కొందరు మహిళలు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


పోలీసులు హెచ్చరికలు జారీ..


సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని రాచకొండ పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో లేదా వాట్సాప్‌లో పరిచయం లేని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోవద్దు. తెలియని నంబర్ల నుండి వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. అలాగే, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్‌కి స్పందించవద్దు. ఒకవేళ మీరు మోసపోయారని గుర్తిస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్‌ క్రైమ్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కు లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa