రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వివిధ రైల్వే జోన్ల్లో ప్రతినెల లక్షల సంఖ్యలో టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నాయి. అక్రమ ప్రయాణాలు చేసే వారి నుంచి జరిమానాల రూపంలో భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం వేల కోట్లు ఆదాయాన్ని పొందుతోంది. SCR ఒక్క నెలలోనే సుమారు 3.83 లక్షల టికెట్ లేని ప్రయాణాల కేసులను నమోదు చేసింది. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పొందింది. గత అక్టోబర్ నెలలో పండుగల సీజన్‌ను పురస్కరించుకుని నిర్వహించిన విస్తృత తనిఖీలలో SCR చరిత్రలోనే అత్యధిక నెలవారీ ఆదాయాన్ని రూ.25.22 కోట్లు వసూలు చేసింది.
టికెట్లు లేకుండా ప్రయాణించడం, అక్రమ ప్రయాణాలు, బుక్ చేయని లగేజీలకు సంబంధించి మొత్తం 3.83 లక్షల కేసులను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నమోదు చేశారు. మొత్తం నెలవారీ ఆదాయంతో పాటు, ఈ జోన్ ఒక్క రోజులోనే అత్యధిక ఆదాయాన్ని కూడా నమోదు చేసింది. ఇటీవల ముగిసిన పండుగల సీజన్లో భాగంగా.. అక్టోబర్ 13వ తేదీన ఒక్క రోజు టికెట్ తనిఖీ ద్వారా రూ.1.08 కోట్లు వసూలు చేసింది. ఇది దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక సింగిల్-డే ఆదాయం కావడం విశేషం. ఈ ఒక్క రోజు తనిఖీల్లోనే సుమారు 16,105 మంది టికెట్లేని లేదా అక్రమంగా ప్రయాణించే ప్రయాణికులను గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేశారు.
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని ఆరు డివిజన్ల పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ జోన్లోలలో తనిఖీలను పటిష్టం చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ల నిర్వహణకు ఆర్పీఎఫ్ సహకారం కూడా తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన స్టేషన్లు, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో తనిఖీలు నిర్వహించడం ద్వారా ఈ రికార్డు ఆదాయం సాధ్యమైంది. సాధారణ రోజుల్లో జోన్ సగటు రోజువారీ ఆదాయం సుమారు రూ.47 లక్షలు కాగా.. అక్టోబర్‌లో ఇది గణనీయంగా పెరిగింది. టికెట్ తనిఖీలను నిరంతరం కొనసాగించడం ద్వారా అనర్హులైన ప్రయాణికులను అరికట్టి, రైల్వే ఆదాయాన్ని పరిరక్షించడంలో అధికారులు సఫలమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa