ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్స్‌లో ఉచితంగా.. రూ.25 లక్షల చికిత్స

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 07:03 PM

పుట్టుకతోనే చెవిటి, మూగ సమస్యలు, శరీరంలో అసాధారణ కదలికలతో బాధపడుతున్న ఒక యువకుడికి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఆధునిక వైద్య ప్రక్రియ ద్వారా ఉపశమనం కలిగించారు. చేతులు, కాళ్లు తనకు తెలియకుండానే కదులుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడిన ఆ యువకుడిని తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. శస్త్ర చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఎంతో ఆవేదనతో నిమ్స్‌కు తీసుకురాగా.. అక్కడి వైద్యులు డీప్ బ్రెయిన్ స్టిములేషన్ (డీబీఎస్) చికిత్స అందించారు.


డీబీఎస్ అనేది అధునాతన న్యూరో సర్జికల్ ప్రక్రియ. ఇది మెదడులోని అసాధారణ కార్యకలాపాలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో.. ఎలక్ట్రోడ్‌లు ఉన్న చిన్న పరికరాన్నిశస్త్ర చికిత్స ద్వారా మెదడులో నిర్దిష్ట ప్రాంతంలో అమరుస్తారు. ఈ వైర్లు చర్మం లోపల నుంచి వచ్చి, ఛాతీ భాగంలో అమర్చిన బ్యాటరీకి.. ఇతర పరికరాలకు అనుసంధానం అవుతాయి.


ఈ మొత్తం వ్యవస్థ బయటకు కనిపించకుండా చర్మం లోపల ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. బయటి నుంచి ప్రోగ్రామింగ్ ద్వారా మెదడులోని నిర్దిష్ట ప్రాంతాలకు విద్యుత్తు ప్రేరణలను పంపుతారు. ఈ ప్రేరణలు మెదడు కార్యకలాపాలను నియంత్రించి , వణుకు (ట్రెంబ్లింగ్), అసంకల్పిత కదలికలు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఫలితంగా రోగికి పెద్ద ఉపశమనం లభించి, తమ పనులు తాము చేసుకునే సామర్థ్యం తిరిగి వస్తుంది.


డీబీఎస్ చికిత్స ప్రధానంగా శరీరంలో అసాధారణ కదలికల ఇబ్బందులు, ఇతర న్యూరోలాజికల్ రుగ్మతలకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. నిమ్స్ ఆసుపత్రిలో ఒక ఏడాది కాలంలోనే 130 మందికి పైగా ఈ చికిత్స ద్వారా ఊరట కల్పించారు. పార్కిన్సన్స్ వ్యాధి , శరీరంలో అసాధారణ కదలికల సమస్యలు, మూర్ఛ (ఎపిలెప్సీ) వంటి వాటితో పాటు, డిప్రెషన్, ఒబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)  వంటి మానసిక రుగ్మతలకు సైతం డీబీఎస్‌తో నాణ్యమైన చికిత్సలు అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు.


ఈ చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో రోగికి సుమారు రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుండగా.. నిమ్స్ ఆసుపత్రిలో 100 మందికి ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా చికిత్స అందించారు. పథకాల కిందకు రాని వారికి కూడా కార్పొరేట్ ఆసుపత్రులతో పోల్చితే చాలా తక్కువ ధరకే సేవలు అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa