జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఈ కౌంటింగ్ జరగనుంది.నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల ఓట్లను మొత్తం 10 రౌండ్లలో లెక్కించనున్నారు. ఇందుకోసం 42 టేబుళ్లను సిద్ధం చేశారు. సాధారణంగా 14 టేబుళ్లనే వినియోగిస్తున్నప్పటికీ, ఇది ఉప ఎన్నిక కావడం, సిబ్బంది అందుబాటులో ఉండటంతో లెక్కింపును వేగంగా పూర్తి చేసేందుకు ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థి, ఆయన ఏజెంట్‌కు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది. 10 హోం ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీసు ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8:45 గంటలకే తొలి రౌండ్ ఫలితం వెలువడుతుందని, మధ్యాహ్నం 12 గంటల కల్లా పూర్తి ఫలితం తేలిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa