తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్లు' పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఎల్ 1 జాబితాలో ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులను జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే రెండేళ్లల్లో కూడా ఎల్ 1 కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకున్న వారు ఏ జాబితాలో ఉన్నారో తెలియదు. అలాంటి వారు ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేటగిరీల్లో మీరు ఏ జాబితాలో ఉన్నారో ఇక్కడ తెలుసుకోవచ్చు. దాని కోసం.. లబ్ధిదారులు అధికారిక వెబ్‌సైట్ https://indirammaindlu.telangana.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ దరఖాస్తు సమయంలో ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా.. తమ దరఖాస్తు ఏ వర్గంలో (L1, L2, L3) ఉందో స్పష్టంగా కనిపిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 77,68,134 దరఖాస్తులు అందాయి. క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఇంటింటి సర్వే ఆధారంగా ప్రభుత్వం దరఖాస్తుదారులను మూడు వర్గాలుగా విభజించింది. సొంత స్థలం ఉండి, ఇల్లు లేనివారు ఎల్ 1 జాబితాలో ఉంటారు. ఈ జాబితాలో 23,20,490 మంది ఉన్నారు. వీరికి రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2026-27, 2027-28) ప్రాధాన్యత క్రమంలో ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఏడాదికి 4.50 లక్షల ఇళ్ల చొప్పున కేటాయింపులు జరగనున్నాయి.
ఎల్-2 (L2): ఇటు స్థలం, అటు ఇల్లు రెండూ లేనివారు. ఈ జాబితాలో 21,49,476 మంది ఉన్నారు. వీరికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీరికి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలా లేక అపార్ట్‌మెంట్ తరహాలో బ్లాక్‌లు కట్టించాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
ఎల్-3 (L3): ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మరియు దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నవారు. ఈ జాబితాలో 32,98,168 మంది ఉండగా.. వీరిని అనర్హులుగా గుర్తించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా సాగాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపికను ఖరారు చేస్తున్నారు. కేవలం రాజకీయ ప్రాబల్యం ఉన్నవారికే కాకుండా.. నిజమైన పేదలకు ఇళ్లు దక్కాలనేది ప్రభుత్వ సంకల్పం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,69,014 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే 2.45 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఎల్-1 జాబితాలోని 23.20 లక్షల మందిలో, రాబోయే రెండేళ్లలో 13.50 లక్షల మందికి ఇళ్లు అందనున్నాయి. మిగిలిన 9.70 లక్షల మందికి ఆ తర్వాతి విడతల్లో అవకాశం కల్పిస్తారు.
ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు విడతల వారీగా.. నిర్మాణ దశను బట్టి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. దీనివల్ల మధ్యవర్తుల బెడద తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎల్-2 జాబితాలోని భూమి లేని పేదల కోసం ప్రత్యేకంగా స్థల సేకరణ చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. అవసరమైతే ప్రభుత్వ భూములను గుర్తించి.. అక్కడ లేఅవుట్లు వేసి పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా.. రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa