ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోయిస్టు రహిత తెలంగాణ దిశగా అడుగులు,,,,డీజీపీ శివధర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 07:57 PM

తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చే దిశగా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యూహాత్మక అడుగులు వేస్తోందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న తెలంగాణ వాళ్లంతా జన జీవన స్రవంతిలో కలిస్తే.. రాష్ట్రం నుంచి ఆ సిద్ధాంతం పూర్తిగా కనుమరుగవుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అడవుల్లో ఉన్నవారు లొంగిపోయి శాంతియుత జీవనం గడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డీజీపీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో తెలంగాణకు చెందిన 17 మంది ఉన్నారు వీరిలో కేంద్ర కమిటీలో నలుగురు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్‌గ్రౌండ్‌లో ఒకరితో పాటు మరొకరు ఉద్యమంలో కొనసాగుతున్నారు.


ఈ 17 మంది మావోయిస్టులపై ప్రభుత్వం మొత్తం రూ. 2.25 కోట్ల భారీ రివార్డును ప్రకటించింది. వీరు గనుక ఆయుధాలు వీడి లొంగిపోతే.. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని డీజీపీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అడవుల్లో ఉన్న ఆ 17 మందిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు డీజీపీ అధికారికంగా ప్రకటించారు. వీరంతా కీలక బాధ్యతల్లో ఉన్నట్లు సమాచారం. మహిళా మావోయిస్టులు లొంగిపోతే వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


కాగా, గత కొన్నేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కీలక నేతలు చనిపోవడం, లొంగిపోవడం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఇటీవల మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న పాక హనుమంతు ఎన్‌కౌంటర్‌లో మరణించడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. సుదీర్ఘ కాలం పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న అగ్రనేత రాజిరెడ్డి ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు టాప్ మావోయిస్టు బర్సే దేవా మరికొందరు కీలక నాయకులు కూడా హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ పరిణామాలు మిగిలి ఉన్న 17 మందిపై కూడా ఒత్తిడి పెంచుతున్నాయి. 'ఆపరేషన్ కగార్' గడువు ముగిసేలోపే తెలంగాణ పూర్తిస్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరిస్తుందని డీజీపీ ధీమా వ్యక్తం చేశారు.


మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సాయుధ పోరాటం ద్వారా సాధించేది ఏమీ లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. లొంగిపోయిన వారికి ఇంటి స్థలాలు, పిల్లల చదువు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa