ట్రెండింగ్
Epaper    English    தமிழ்

850 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 08:06 PM

తెలంగాణలోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి చికిత్సను అందించడమే లక్ష్యంగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాసనసభ వేదికగా ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై పెరుగుతున్న ప్రజల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1790 వెంటిలేటర్ బెడ్లకు అదనంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిని గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు జిల్లా ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.


 రోగ నిర్ధారణలో కీలకమైన 9 కొత్త ఎంఆర్‌ఐ యంత్రాలను వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేవలం ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులకు పరిమితమైన ఈ సేవలను విస్తరించడం ద్వారా పేదలకు ఖరీదైన పరీక్షలు ఉచితంగా అందుతాయన్నారు. రాష్ట్రంలోనే అత్యున్నత వైద్య సేవలందించే నిమ్స్ ఆసుపత్రికి వస్తున్న తాకిడిని తగ్గించేందుకు, సేవల నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. నిమ్స్‌లో అదనంగా 125 వెంటిలేటర్లను ఏర్పాటు చేయడంతో పాటు.. నిరుద్యోగులకు తీపి కబురు చెబుతూ ఖాళీగా ఉన్న 850 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.


ప్రమాద కాలంలో ప్రాణాలు కాపాడే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్‌ను ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందన్నారు. గతంలో 18 నిమిషాలుగా ఉన్న రెస్పాన్స్ టైమ్.. కొత్తగా వచ్చిన 213 అంబులెన్స్‌ల వల్ల ప్రస్తుతం 13 నిమిషాలకు చేరిందన్నారు. ఈ ఏడాది మరో 79 కొత్త అంబులెన్స్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సమయాన్ని 10 నిమిషాలకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. డయాలసిస్ రోగుల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే కేవలం 20 నిమిషాల ప్రయాణంలో లేదా ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే గత రెండేళ్లలో 16 కొత్త కేంద్రాలు, వందకు పైగా మిషన్లను అదనంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు.


నగరాల్లోని సామాన్యులకు చేరువగా ఉండే బస్తీ దవాఖానాల్లో మందుల కొరతను నివారించేందుకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇకపై పీహెచ్‌సీల ద్వారా కాకుండా.. నేరుగా సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ నుంచే మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను అత్యాధునిక వైద్య నిలయాలుగా తీర్చిదిద్ది, సామాన్యుడికి భరోసా కల్పించడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa