తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని ముమ్మరంగా అమలు చేస్తోంది. సాగు పనుల్లో కూలీల కొరతను అధిగమించడంతో పాటు.. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పనులు పూర్తి చేసేందుకు వీలుగా రైతులకు భారీ సబ్సిడీలను అందిస్తోంది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండల వ్యవసాయ శాఖ ద్వారా అర్హులైన రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్నారు. ప్రస్తుత విడతలో ప్రభుత్వం ప్రధానంగా రోటోవేటర్లు, స్ప్రేయర్లపై సబ్సిడీని ప్రకటిస్తోంది. రైతులపై ఆర్థిక భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వీటిపై రాయితీలు కల్పిస్తున్నారు.
రోటోవేటర్.. పొలం దున్నడానికి ఉపయోగపడే రోటోవేటర్ కొనుగోలుపై 50,000 రూపాయల వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. దీనిపై దాదాపు 50 శాతం వరకు రాయితీ కల్పిస్తారు. పురుగుల మందుల పిచికారీ కోసం ఉపయోగించే ఆధునిక హోండా కంపెనీ స్ప్రేయర్లపై 10,000 రూపాయల రాయితీ లభిస్తుంది.
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే రైతులు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాగు భూమి కనీసం ఒక ఎకరం అంతకంటే ఎక్కువ కలిగి ఉండాలి. రోటోవేటర్ కోసం దరఖాస్తు చేసే రైతులకు సొంతంగా ట్రాక్టర్ ఉండాలి. ఆ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పత్రం తప్పనిసరిగా రైతు పేరు మీద లేదా భార్య/భర్త పేరు మీద ఉండాలి.
ట్రాక్టర్ ఆర్సీ కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే నమోదై ఉండాలి. కమర్షియల్ లేదా రవాణా విభాగంలో నమోదైన ట్రాక్టర్లకు ఈ రాయితీ వర్తించదు. ఆసక్తి గల రైతులు నిర్ణీత గడువులోగా పత్రాలను మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పట్టాదారు భూమి పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (రోటోవేటర్ దరఖాస్తుదారులకు మాత్రమే), బ్యాంక్ ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొల్లాపూర్ మండల పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి చిన్న హుస్సేన్ యాదవ్ కోరారు.
దరఖాస్తులు సమర్పించడానికి జనవరి 24వ తేదీని గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు కాబట్టి.. రైతులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా సాగు ఖర్చులు తగ్గి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ పేర్కొంటోంది. భవిష్యత్తులో మరిన్ని పరికరాలను కూడా ఈ రాయితీ జాబితాలో చేర్చే యోచనలో ప్రభుత్వం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa