తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట మాజీ మంత్రి హరీశ్‌రావు ఇవాళ హాజరయ్యారు. సుమారు 7 గంటల పాటు సాగిన ఈ విచారణ అనంతరం ఆయన నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. తనపై జరుగుతున్న ఈ విచారణ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్‌తో చేస్తున్న కక్ష సాధింపు చర్యేనని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి సంబంధించిన రూ. వేల కోట్ల బొగ్గు కుంభకోణాన్ని తాను ఆధారాలతో సహా బయటపెట్టినందుకే, తనను ఏదో ఒక కేసులో ఇరికించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.
రేవంత్ రెడ్డి నిజాయతీపరుడైతే బొగ్గు స్కామ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తాము జడ్జికి సమర్పిస్తామని ఆయన సవాల్ విసిరారు. మంత్రుల మధ్య వాటాల పంపకాలపై జరుగుతున్న అంతర్గత గొడవలను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను విచారణకు పిలిచారని ఆయన విమర్శించారు. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నల కంటే.. తానే వారిని ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు హరీశ్‌రావు వెల్లడించారు. 'నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, అందుకే విచారణకు హాజరయ్యాను. కానీ ప్రభుత్వం మీడియాకు తప్పుడు లీకులు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే నా విచారణకు సంబంధించిన పూర్తి వీడియోను బయటపెట్టాలి' అని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగిన కాలంలో తాను హోంమంత్రిగా లేనని, తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డిలను విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా గాలికొదిలేసిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 'దండుపాళ్యం ముఠా' లాగా దోపిడీ సాగుతోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇస్తున్న నోటీసులు వారి పతనాన్ని వేగవంతం చేస్తాయని త్వరలోనే ప్రజలు ఈ పాలనపై తిరగబడతారని హెచ్చరించారు. మొత్తానికి హరీశ్‌రావు విచారణతో తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa