ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక స్టేషన్‌కు వెళ్లక్కర్లేదు,,,,,ఇంటి వద్దకే పోలీసు సేవలు, ఫిర్యాదులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 09:48 PM

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నేరుగా వారి ఇంటి వద్దే పోలీసులే వెళ్లి ఫిర్యాదు స్వీకరించే చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. వృద్ధులు, మహిళలు, బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధితుల ఫోన్‌కు కాపీ పంపించనున్నారు. ఇకపై అన్ని ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీస్ శాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పోలీసు స్టేషన్ల వరకు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయలేని అనేక మంది బాధితులకు గొప్ప ఊరట ఇవ్వనుంది.


సత్ఫలితాలిస్తున్న ‘సీ-మిత్ర’


హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి 9న ప్రారంభమైన 'సీ-మిత్ర' కార్యక్రమం కేవలం పది రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలను సాధించింది. వర్చువల్ పోలీసింగ్ విధానంలో భాగంగా అమల్లోకి వచ్చిన ఈ వ్యవస్థ, బాధితులకు మానసిక భరోసాతో పాటు చట్టపరమైన సహకారాన్ని అందిస్తోంది. గత 10 రోజుల్లో సీ-మిత్ర బృందం సుమారు 1,000 మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి సమస్యలను అడిగి తెలుసుకుంది. సగటున రోజుకు 100 కాల్స్ చేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 200 మంది బాధితులకు పక్కాగా లీగల్ డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసి పంపింది. బాధితుల నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే, ఎక్కడా జాప్యం లేకుండా ఇప్పటికే 100కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. దీనివల్ల స్టేషన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం తప్పింది.


ఫిర్యాదు చేసే విధానం ఇదే..


సైబర్ నేరానికి గురైన వారు 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా జాతీయ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ వెంటనే సీ-మిత్ర బృందం బాధితులకు కాల్ చేసి వివరాలు సేకరిస్తుంది. ఏఐ సాంకేతికతతో సిద్ధం చేసిన ఫిర్యాదు కాపీని వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా పంపిస్తారు. బాధితులు ఆ కాపీపై సంతకం చేసి బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు పోస్ట్ లేదా కొరియర్ చేస్తే సరిపోతుంది. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఆ వివరాలు నేరుగా బాధితుడి మొబైల్‌కే అందుతాయి.


ప్రత్యేక బృందాల నిఘా


ఈ సేవలను పర్యవేక్షించేందుకు 24 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం రెండు షిఫ్టుల్లో (ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు) పనిచేస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రారంభించిన ఈ విధానం, టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడమే కాకుండా ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచుతోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa