ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలోనే తొలిసారిగా....వరంగల్‌లో ఉమెన్ కమాండో ఫోర్స్ టీం 'రుద్రమ'

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 08:32 PM

వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళా శక్తికి నిదర్శనంగా, రాణి రుద్రమదేవి వీరత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా 'రుద్రమ' మహిళా పోలీస్ కమాండో బృందం రణక్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వినూత్న ఆలోచనతో.. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా వరంగల్‌లో ఈ ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ రూపుదిద్దుకుంది. కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా ఈ బృందానికి కఠిన శిక్షణ ఇచ్చారు.


ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న 40 మంది మహిళా కానిస్టేబుళ్లలో అత్యంత ప్రతిభావంతులైన 21 మందిని ఈ ప్రత్యేక విభాగం కోసం ఎంపిక చేశారు. ఈ టీంలో కేవలం శారీరక ధృడత్వమే కాకుండా, మేధోపరమైన సత్తా ఉన్న వారు కూడా ఉన్నారు. బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్ వంటి క్రీడల్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన వారితో పాటు ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యావంతులు కూడా 'రుద్రమ' సైనికులుగా మారడం విశేషం.


రుద్రమ టీంకు అందించిన శిక్షణ సాధారణమైనది కాదు. సుమారు నెలన్నర పాటు దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్‌ఎస్‌జీ (NSG), గ్రేహౌండ్స్ తరహాలో కఠినతరమైన కమాండో ట్రైనింగ్‌ను వీరికి ఇప్పించారు. నిత్యం 10 కిలోమీటర్ల పరుగు, రోప్ క్లైంబింగ్, అడవుల్లో కూంబింగ్ వంటి సవాళ్లను వీరు అధిగమించారు. ముఖ్యంగా ఏకే-47, ఎస్ఎల్ఆర్ వంటి భారీ ఆయుధాలను వాడటంలో వీరు ఆరితేరారు. కళ్లకు గంతలు కట్టుకుని సెకన్ల వ్యవధిలో వెపన్స్‌ను విడదీయడం, తిరిగి అమర్చడం వంటి 'బ్లైండ్ ఫోల్డ్' విద్యలో వీరు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు.


కేవలం యుద్ధ తంత్రాలే కాకుండా.. ఆపద సమయాల్లో తోటి వారిని రక్షించడం, మ్యాప్ రీడింగ్ ద్వారా అడవుల్లో గమ్యాన్ని చేరడం వంటి సాంకేతిక అంశాల్లోనూ వీరికి పట్టు సాధించారు. కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలతో పాటు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానంలోనూ శిక్షణ పొందారు. బాంబులను నిర్వీర్యం చేయడం వంటి ప్రాణాంతకమైన పనులను కూడా వీరు అలవోకగా చేసేలా తీర్చిదిద్దారు.


ఈ శిక్షణ పొందిన మహిళా కమాండోలు తమ అనుభవాలను పంచుకుంటూ.. మొదట్లో ఆయుధాలు పట్టాలంటే భయపడేవారమని, కానీ ఇప్పుడు పురుష కమాండోలతో సమానంగా ఎలాంటి ఆపరేషన్ అయినా చేయగలమన్న ఆత్మవిశ్వాసం కలిగిందని గర్వంగా చెబుతున్నారు. వరంగల్ నగరంలో అల్లర్లు అణచడానికైనా, ప్రముఖుల బందోబస్తుకైనా, అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లకైనా ఈ 'రుద్రమ' బృందం ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa