ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 27, 2026, 07:10 PM

తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌‌ను విడుదల చేశారు. దీంతో నేటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ మెుదలు కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న స్క్రూట్నీ, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సివస్తే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్‌ఫర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది.


షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం ఎస్ఈసీ రాణి కుముదిని మాట్లాడుతూ.. మెుత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. 2996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పిస్తామన్నారు. రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


ముఖ్య తేదీలు


నామినేషన్ల స్వీకరణ -జనవరి 28 నుంచి 30 వరకు


నామినేషన్ల పరిశీలన -జనవరి 31


నామినేషన్ల ఉపసంహరణ - ఫిబ్రవరి 3


పోలింగ్ - ఫిబ్రవరి 11


ఫలితాల వెల్లడి - ఫిబ్రవరి 13


మేయర్, ఛైర్ పర్సన్‌ల ఎన్నిక - ఫిబ్రవరి 16






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa