ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోటీలో,,,, అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 08:58 PM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. ఎన్నికలు జరగనున్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రెండు రోజుల్లో 9,276 నామినేషన్లు సమర్పించారు. చివరి రోజైన శుక్రవారం (జనవరి 30) 19,180 దాఖలు కావడం గమనార్హం. అయితే అమరవీరుడు మేజర్ సంతోశ్ బాబు తల్లి కూడా తెలంగాణ మున్సిపల్ బరిలో దిగుతున్నారు. ఈ మేరకు సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు అభ్యర్థిగా బికుమళ్ల మంజుల ఉపేందర్ నామినేషన్ దాఖ‌లు చేశారు.


ఈ సందర్భంగా మంజుల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసిన కేసీఆర్ పాలన తీరు బాగుందన్నారు. అంతేకాకుండా గత పదేళ్లలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేటలో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరిగిందని ప్రశంసించారు. ఆలాంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మంజుల మీడియాకు వెల్లడించారు.


తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌ లోయలో 2020 జూన్ 15న చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్‌ సంతోశ్ బాబు అమరవీరుడయ్యారు. ఈయనతో సహా 20 మంది సైనికులు వీర మరణం పొందారు. గల్వాన్‌ ప్రాంతంలో ‘16 బిహార్‌’ రెజిమెంట్‌ కల్నల్‌ సంతోశ్ బాబు కమాండింగ్‌ అధికారి (సీవో)గా ఉన్నారు. దాదాపు నెల రోజులు జరిగనఉద్రిక్త పరిస్థితుల వల్ల రెండు దేశాలూ పోటాపోటీగా అక్కడికి బలగాలను మోహరించారు. అక్కడ వేడిని చల్లార్చేందుకు ఇరు దేశాల లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఒప్పందం ప్రకారం రెండు దేశాలు తమ సరిహద్దుల నుంచి అదనపు బలగాలను వెనక్కి తరలించాల్సి ఉంది.


కానీ చైనా సైనికులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసినట్లే చేసి.. మళ్లీ శిబిరాలు ఏర్పాటు చేసింది. కానీ ఒప్పందం ప్రకారం వాటిని తొలగించాలని ‘16 బిహార్‌’ దళం వెళ్లింది. అయినా చైనా దళాలు వినిపించుకోలేదు. ఈ విషయం సంతోష్‌ బాబుకు బిహార్ దళం చెప్పింది. దీంతో సంతోశ్ బాబు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ సంతోశ్ బాబు చనిపోయారు. కాగా, సంతోశ్ బాబు నేతృత్వంలోని కేవలం 100 మంది సైనికులు.. చైనాకు చెందిన దాదాపు 300 మంది సైనికులపై విరుచుకుపడ్డారు. పోరులో పైచేయి సాధించి డ్రాగన్ తోకముడిచేలా చేశారు. చివరి శ్వాస వరకు సంతోశ్ బాబు భరతమాతకు చేసిన సేవను 'మహావీరచక్ర'తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa