తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో గ్రామ పంచాయతీలకు రావాల్సిన బకాయిలకు సంబంధించి కీలక ప్రకటన వెలువరించింది. 15వ ఆర్థిక సంఘం నిధులను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా రూ.259.36 కోట్లను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో.. ఇన్ని రోజులుగా ఈ 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది. పంచాయతీల పదవీ కాలం పూర్తి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించకపోవడంతో నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసింది.
రాష్ట్రంలో గ్రామ పంచాయితీలకు ఎన్నికలు ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ఆగిపోయింది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించింది. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడి.. గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు అయ్యాయి. అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుదామంటే ఖజానా ఖాళీగా ఉండటంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తొలి విడత నిధులు రిలీజ్ కావడంతో భారీ ఊరట కలిగింది.
పంచాయతీ ఎన్నికలు పూర్తికావడం.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడంతో ఈ నిధులను విడుదల చేసింది అయితే 15వ ఆర్థిక సంఘం నిధుల కింద.. కేంద్రప్రభుత్వం మొత్తం రూ.3 వేల కోట్ల వరకు తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా.. మొదటి విడతలో భాగంగా ఈ రూ.259.36 కోట్లను విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం.. ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్‌లు ఉంటేనే ఈ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామాల్లో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa