ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు.. ఈ విధానంలో అకౌంట్లలోకి డబ్బులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 07:13 PM

తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరులుగా విభజించి ప్రస్తుతం ఎల్-1 కేటగిరిలో ఉన్న వారి ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. మెుత్తం నాలుగు విడతల్లో రూ. 5 లక్షలు ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు చేసింది. మొదటి, రెండు, నాలుగు విడతలు మినహా మిగిలిన మూడో విడత బిల్లుల చెల్లింపుల్లో ఈ మార్పులు చేసింది. ఈ విడతలో బిల్లులను వీబీ జీరామ్‌జీ పథకానికి అనుసంధానం చేశారు. జాబ్‌కార్డు కలిగి ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించి.. ఆ వేతనం డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.


తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. పునాది వరకు పూర్తి చేస్తే రూ.లక్ష, గోడలు నిర్మించిన తర్వాత మరో లక్ష, స్లాబ్‌ వేసిన తర్వాత రూ.1.40 లక్షలు, పని పూర్తయిన తర్వాత రూ.లక్ష చొప్పున మొత్తం రూ.4.40 లక్షలు చెల్లించనున్నారు. అయితే మూడో దశలో స్లాబ్ వేసిన తర్వాత.. ఉపాధిహామీ కింద రోజుకు రూ.307 చొప్పున 90 రోజులకు రూ.27,630 చెల్లించనున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద బాత్‌రూం నిర్మించుకుంటే రూ.12 వేలు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన కింద మరో రూ.21వేల చొప్పున మొత్తం రూ.60 వేలను లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నారు.


అయితే గత రెండేళ్లుగా ఉపాధిహామీలో కొత్తగా జాబ్‌కార్డుల జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారిలో చాలా మంది జాబ్‌కార్డులు లేనివారు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీరు ఈ పథకాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా ఉపాధి జాబ్‌ కార్డులు జారీ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారు. అర్హుల పరిశీలన అనంతరం జాబితాలను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వీరిలో కొందరికి ఇప్పటికే నూతన జాబ్‌కార్డులు మంజూరయ్యాయి. త్వరలోనే మిగిలిన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లుగా సంబంధిత అధికారులు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa