ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహాజాతర విజయవంతంగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. రెండున్నర కోట్లకు పైగా భక్తులు.. మేడారం తరలివచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో జాతర వచ్చేసింది. రాష్ట్రంలో మేడారం జాతర తర్వాత అత్యంత వైభవంగా జరిగే మరో జాతరగా గుర్తింపు పొందిన ఏడుపాయల వనదుర్గాభవాని మాత మహా జాతరకు షెడ్యూల్ విడుదల అయింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరానున్నారు.
మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి మధ్యలో వెలిసిన ఆ వనదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మెదక్ జిల్లా యంత్రాంగం.. ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏడుపాయల వద్ద మంజీరా నది.. ఏడు పాయలుగా విడిపోయి.. వనదుర్గమ్మ అమ్మవారి పాదాల చెంత నుంచి ప్రవహిస్తుంది. ఈ పవిత్ర క్షేత్రానికి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు.
ఈసారి ఏడుపాయల మహాజాతరలో భాగంగా తొలిరోజు మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని.. భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఆ తర్వాత వనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక రెండో రోజైన ఫిబ్రవరి 16వ తేదీన ఏడుపాయల జాతరలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టమైన బండ్ల ఉత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహించనున్నారు.
ఈ బండ్ల ఉత్సవానికి.. ఏడుపాయల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు తమ ఎడ్లబండ్లను రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించి తీసుకువస్తారు. వాటిని ఆలయ చుట్టూ ప్రదర్శనగా తిప్పుతూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక జాతర చివరి రోజైన ఫిబ్రవరి 17వ తేదీన రథోత్సవంతో ఈ మహా క్రతువు ముగియనుంది.
ఇక ఈ ఏడుపాయల జాతరకు కేవలం స్థానిక మెదక్ జిల్లా నుంచి మాత్రమే కాకుండా సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వస్తారు. తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల భక్తులు కూడా లక్షల్లో తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారందరికీ.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాటిని అనుగుణంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏడుపాయల జాతర కు వచ్చే భక్తులు స్నానాలు చేసే సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంజీరా నదిలోకి సరిపడినన్నీ నీటిని విడుదల చేయడంతో పాటు.. ఘాట్ రోడ్లకు మరమ్మతులు, నీళ్లలో బారికేడ్లను నిర్మించడం.. ఆలయ పరిసరాల్లో తాగునీటి సరఫరాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏడుపాయల జాతర కోసం వచ్చే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులను నడపనుంది. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa