ఈనెల 15వ తేదీన మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా.. శైవక్షేత్రాలకు పోటెత్తే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. శివభక్తుల సౌకర్యం కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం 43 ఆలయాలకు బస్సులను నడపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం 2243 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్ట్సీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీన మహా శివరాత్రి కాగా.. ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు నడపనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ స్పెషల్ బస్సులను ప్రధాన శైవక్షేత్రాలుగా వెలుగొందుతున్న శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల క్షేత్రాలకు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో ఒక్క శ్రీశైలం ఆలయానికి 781 బస్సు సర్వీసులను కేటాయించినట్లు తెలిపారు. వేములవాడకు మరో 416 బస్సులు, ఏడుపాయలకు 249 బస్సులు, కీసరగుట్టకు 326 బస్సులు, వేలాలకు 127 బస్సులు, కాళేశ్వరానికి 71 బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. వీటిపాటు రాష్ట్రంలో మిగితా ఆలయాలు అయిన కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప వంటి ఆలయాలకు కూడా మరో 273 స్పెషల్ బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రయాణికుల రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇక ఈ స్పెషల్ బస్సులు ప్రారంభమయ్యే ప్రాంతాల్లో టెంట్లు, కుర్చీలు, తాగునీరుతో పాటు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని తెలిపారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం.. మహా శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను పెంచినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈ స్పెషల్ బస్సుల్లో ఒకటిన్నర రెట్లు వరకు టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే రెగ్యులర్ బస్సు సర్వీస్ టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మొత్తం 3 రోజులు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే ఈ పెరిగిన టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఇప్పటికే మహా శివరాత్రికి ఆర్టీసీ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ శ్రీ వై.నాగిరెడ్డి ఐపీఎస్ ఇప్పటికే సమీక్ష ఏర్పాటు చేశారు. శివరాత్రి పండగకు ఆలయాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గతేడాది కన్నా ఈసారి అదనంగా మరో 208 బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఇక మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే స్పెషల్ బస్సులకు బుకింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa