హైదరాబాద్ శివారులో ఫార్మా, ఐటీ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. తుక్కుగూడ ఫ్యాబ్‌సిటీలో ఈ సంస్థల ఏర్పాటకు రెవెన్యూ, పరిశ్రమలశాఖ అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఫ్యాబ్ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలోని 922 ఎకరాలను ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం డీ-నోటిఫై చేసింది. దీంతో రెండు విభాగాల అధికారులు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రెండేళ్లలో ఇక్కడ ఈ పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా , పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని టీజీఐఐసీ అంచనా వేస్తోంది.
ఫ్యాబ్‌సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థలు, ఎలక్ట్రిక్ విభాగాల కంపెలనీల ఏర్పాటుకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు వచ్చేలా పరిశ్రమలు ప్రత్యేకంగా బ్లాకులను విభజించనున్నారు. ఇప్పటికే ఇక్కడ మౌలిక వసతులు ఉన్నందున కొత్తగా ప్లాట్లను విభజించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయా పరిశ్రమలకు భూములను కేటాయించనున్నారు. రానున్న ఒకటి, రెండు నెలల్లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు టీజీఐఐసీ ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తుక్కుగూడ ఫ్యాబ్‌సిటీని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా మీర్‌ఖాన్‌పేట్‌లో ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీతో అనుసంధానం చేయాలని టీజీఐఐసీ అధికారులు భావిస్తున్నారు. భారత్ ఫ్యూచర్‌సిటీకి, ఫ్యాబ్‌సిటీ మధ్య కేవలం 15 కిలోమీటర్ల దూరం ఉండటంతో అభివృద్ధిలో భాగంగా రోడ్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించనున్నారు. ఐటీ, ఫార్మా సంస్థల నిర్మాణ పనులకు కీలకమైన విద్యుత్తు సౌకర్యం, వాటర్ ఫెసిలిటీ లభించేలా చర్యలు చేపట్టనున్నారు. ఫ్యాబ్‌సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీలకు ప్రస్తుతం హైదరాబాద్- శ్రీశైలం రోడ్డు, శంషాబాద్- గచ్చిబౌలి బాహ్యవలయ రహదారులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఫ్యూచర్ సిటీకి కొంగరకలాన్ నుంచి 330 అడుగుల హైవేను నిర్మిస్తున్నారు. వీటికి అదనంగా తుక్కుగూడ మీదుగా కొంగరకలాన్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ వరకూ మరో రోడ్డును సైతం ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఈ రహదారి పనులను కూడా ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa