నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణానదిపై నిర్మించతలపెట్టిన సోమశిల-సిద్ధేశ్వరం ఐకాన్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కీలక ముందడుగు పడింది. ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతుల మంజూరు ప్రక్రియలో భాగంగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పర్యటించింది. వంతెన నిర్మించనున్న ప్రదేశాన్ని పరిశీలించి, పర్యావరణపరమైన అంశాలను అంచనా వేసింది. జాతీయ రహదారి 167కేలో భాగంగా సోమశిల, మల్లేశ్వరం ప్రాంతాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి సుమారు రూ.1086 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు నల్లమల అభయారణ్యం పరిధిలో ఉన్నందున, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం కేంద్రం నుంచి పర్యావరణ, అటవీ అనుమతులు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే అధికారుల బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హైబ్రిడ్ కేబుల్-స్టేడ్, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుంది. అధికారుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అటవీ అనుమతులపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ క్లియరెన్సులు లభించిన వెంటనే ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు మార్గం సుగమం అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa