హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లిదండ్రులతోపాటు కుమారుడు కూడా బలవన్మరణానికి పాల్పడటం సంచలనంగా మారింది. బిజినెస్‌లో తలెత్తిన నష్టాల కారణంగానే ఆ కుటుంబ సభ్యులు ప్రాణాలు తీసుకున్నట్లు.. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చనిపోవడానికి ముందు.. ఆ ఇంటి పెద్ద తన ఫ్రెండ్‌కు తెల్లవారుజామున వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ మెసేజ్ చూసి.. ఆ వ్యక్తి ఇంటికి వచ్చి చూసే సరికి ఆ ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నట్లు చూసి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అంబర్‌పేట్‌లో నివసించే రామరాజు (55), మాధవి (50) దంపతులకు శశాంక్ (24) ఉన్నాడు. అయితే మొదట మాధవిని దిండుతో ఊపిరాడకుండా చేసి.. రామరాజు, శశాంక్ హత్య చేశారని.. ఆ తర్వాత రామరాజు ఉరివేసుకుని చనిపోగా.. శశాంక్ మణికట్టు కోసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఆ రామరాజు కుటుంబం ఆత్మహత్య పాల్పడ్డట్టు విచారణలో తేలింది.
రామరాజుకు స్థానికంగా హోటల్ బిజినెస్ ఉంది. అయితే వ్యాపారంలో భారీగా నష్టం తలెత్తడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి ఆ కుటుంబం కూరుకుపోయింది. డబ్బులు కట్టకపోవడంతో అప్పుల వాళ్ల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రామరాజు, మాధవి, శశాంక్‌ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఆర్థిక భారం ఎక్కువ కావడంతోనే ఆ ముగ్గురు సూసైడ్ చేసుకున్నారని.. అదే విషయం ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌లో వారు రాసిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటలకు రామరాజు.. రవి అనే ఫ్రెండ్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేసినట్లు తెలిపాడు. అయితే ఆ మెసేజ్ చూసిన తర్వాత రామరాజు ఇంటికి వచ్చి రవి చూసేసరికి ఆ కుటుంబం విగత జీవులుగా పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ క్లూస్ టీం.. ఆధారాలు సేకరించారు. అంబర్‌పేట్‌లో ల్యాండ్ మార్క్ హోటల్‌ను మొదట రామరాజు కుటుంబం నడిపిందని.. ఆ తర్వాత మల్లపల్లిలో బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే వ్యాపారంలో నష్టం తలెత్తడంతో వారికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయని.. ఆ కారణంగానే చనిపోయినట్లు తెలుస్తోంది. అప్పులు ఇచ్చిన వారు ఎవరైనా రామరాజు కుటుంబాన్ని భయపడితే చనిపోయారా.. లేక అప్పులు కట్టలేమని వాళ్లే ఆత్మహత్య చేసుకున్నారా.. దీని వెనుక ఏదైనా కారణం ఉందా అనే వాటిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa