నగరంలో చెరువుల అభివృద్ధిని వేగం చేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అధికారులను ఆదేశించారు. చెరువులలో మురుగు నీటిని వెంటనే తొలగించాలని సూచించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి ఎక్కడా తగ్గకుండా చూడాలన్నారు. రామచంద్రాపురంలోని గంగారం చెరువుతో పాటు.. ఈర్ల చెరువును హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హైడ్రా రెండో విడత చేపడుతున్న14 చెరువులలో ఈ రెండు చెరువులు కూడా ఉన్నాయనే విషయం విధితమే. వరద కాలువ ద్వారానే కాకుండా... నేరుగా మురుగు వివిధ ప్రాంతాల్లో చెరువులోకి ప్రవేశించడం, గుర్రపు డెక్కతో చెరువులు దుర్గంధభరితంగా మారడానికి గల కారణాలను పరిశీలించారు. చెరువుల్లోకి నేరుగా మురుగు నీరు చేరకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. మురుగు కాలువలన్నిటినీ అనుసంధానం చేసి ఎస్‌టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం) వద్ద ట్రీట్ అయిన తర్వాతే చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గంగారం చెరువు 111 ఎకరాల మేర విస్తరించి ఉంది. అలాగే ఈర్ల చెరువు 32 ఎకరాల వరకూ ఉంది. ఈ చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలు ఎట్టి పరిస్థతుల్లోనూ తగ్గవద్దని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అధికారులను ఆదేశించారు. బఫర్ జోన్‌తో పాటు..చెరువుల వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కాపాడాలన్నారు. పార్కులు, పిల్లల ప్లే ఏరియాలు, అన్ని వయసులవారు సేద దీరేలా సీటింగ్ ఏర్పాట్లు అన్నీ అందుబాటులోకి రావాలని సూచించారు. చెరువుచుట్టూ ఎత్తుగా పెరిగి నీడనిచ్చే చెట్లను కూడా పెంచేందుకు అవసరమైన స్థలం ఉండేలా చూడాలని సూచించారు. చెరువుల్లోకి మురుగు నీరు నేరుగా చేరకుండా ఎస్‌టీపీలు ఏర్పాటుకు, మురుగు నీరు సెడిమెంటేషన్ పాండ్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఉండేలా చూసుకోవాలని సూచించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్లపాపయ్య గారితో పాటు పలువురు అధికారులు ఈ పర్యటనలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa