సున్నం చెరువుతో పాటు.. మరే ఇతర చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలు ఒక్కసారి ఫిక్స్ అయితే.. అవి మారవని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు స్పష్టం చేశారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిని 2014లోనే నిర్ణయించారని.. ఆ మేరకే అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సున్నం చెరువు వద్ద కొందరికి లబ్ధి చేకూర్చాలని 5 ఎకరాల వరకూ మినహాయించి ఎఫ్టీఎల్ హద్దులను హైడ్రా నిర్ధారిస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. సున్నం చెరువు వద్ద ప్రభుత్వ భూమిని కలిపి గతంలో ఫెన్సింగ్ వేసి ఉంటారు.. చెరువు ఎఫ్టీఎల్ కు ఇది వర్తించదన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే తాము పని చేస్తున్నామని స్పష్టం చేశారు. చెరువు చెంత ప్రభుత్వ భూమి ఉంటే తప్పకుండా స్వాధీనం చేసుకుని.. అక్కడ పార్కులు, ప్లే ఏరియాలు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. మాధాపూర్‌లోని తమ్మిడికుంటతో పాటు.. మొదట విడత చేపట్టిన 6 చెరువుల వద్దా ప్రభుత్వ భూములుంటే స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేశామని కమిషనర్ స్పష్టం చేశారు. గతంలో హైడ్రా చర్యలను అభినందించడమే కాదు.. సహకరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.. అకస్మాత్తుగా హైడ్రా చర్యలతో పాటు.. వ్యక్తిగత విమర్శలకు దిగడం వెనుక ఉన్న కారణాలేంటో అర్థం కావడం లేదన్నారు. కూకట్పల్లి జోన్ పరిధిలో భూములు విలువ ఎక్కువగా ఉండడం వల్లో మరే ఇతర కారణాలో కాని.. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్టు ఎక్కువ ఫిర్యాదులు అక్కడి నుంచే వస్తున్నాయని కమిషనర్ చెప్పారు. హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే కూకట్పల్లి జోన్ నుంచి 40 శాతం వరకూ అందుతున్నాయన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూములు కాపాడి పర్యావరణహితమైన నగర నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని.. ఆ దిశగానే హైడ్రా పని చేస్తోందన్నారు. ఏ ఒక్కరి పక్షాణ హైడ్రా పని చేయదు. ప్రజలందరూ మెరుగైన జీవితం సాగించేలా హైడ్రా ప్రతి చర్య ఉంటుందని స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటివరకూ 1240 చోట్ల ఆక్రమణలు తొలగించి 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఇందులో బడాబాబులుగా చెలామణి అవుతున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పని చేస్తోంది. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే హైడ్రా వంతు. ప్రజలందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ దిశగా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం విలేజ్‌లో హైడ్రా స్వాధీనం చేసుకున్న దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని వెనువెంటనే ప్రజావసరాలకు ఉద్దేశించి పలు శాఖలకు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అక్కడ సాంఘిక సంక్షే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా వివిధ శాఖలకు కేటాయింపులు ప్రభుత్వం చేసింది. అలాగే శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో ఇటీవల హైడ్రా 7 ఎకరాల వరకూ హైడ్రా కాపాడితే.. ఆ వెంటనే ప్రభుత్వ విద్యా సంస్థలకు కేటాయించడంతో పాటు.. పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa