ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలేజీ అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు, మహిళలకు ఏసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2026, 06:11 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. మహిళలకు ఏసీ బస్సుల్లోనూ ఫ్రీ బస్ జర్నీ, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండి కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తాజాగా కాలేజీ చదువుతున్న విద్యార్థినులకు త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని సీఎం తెలిపారు. త్వరలోనే వాటిని అందజేసే ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుని మహిళలు ఉన్నత స్థానాలకు చేరాలని ఆంకాంక్షించారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని ఈ మేరకు ప్రకటన చేశారు.


'మహిళలకు ఎప్పుడు గుర్తింపు ఇవ్వాలనేదే మా లక్ష్యం. తెలంగాణలోని కీలకమైన శాఖలన్నీ మహిళా అధికారులు సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలక పాత్ర. దేశంలో కులాల మధ్యే కాదు స్త్రీ, పురుషుల మధ్య రకరకాల వివక్ష ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వివక్ష ఉంది. కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు, ముందుకు వెళ్లేవారికి అవకాశం ఉంది. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఏదేశమైనా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుంది. ఇండియాలో మహిళల శ్రమకు గుర్తింపు, ఫలితం లేదు. ఇంటి, ఆఫీస్ పనుల్లో చులకన చూసే మాటలు వస్తుంటాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే మహిళల టాలెంట్‌ను గుర్తించి వారిని ప్రోత్సహించే బాధ్యత ఆయా సంస్థలపై ఉంది. వ్యక్తులుగా కొన్ని మనం చేయలేం. కానీ వ్యవస్థగా ఆ టాలెంట్‍ను గుర్తించి అవకాశం కల్పించవచ్చు.


అమెజాన్‍లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ప్రపంచానికి విక్రయించేలా అవకాశం కల్పించాం. ఇందిరా బజార్ ద్వారా లోకల్ టాలెంట్‍ను గ్లోబల్ టాలెంట్‍గా తీర్చిదిద్దేందుకు అవకాశం కల్పించాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారని వారిని చిన్నచూపు చూస్తారు. అందుకే వారి చేతనే బస్సులకు యజమానులను చేసి వ్యాపారాల్లో రాణించేలా అవకాశం కల్పించాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం స్వయం సహాయం సంఘాలకు అవకాశం ఇచ్చాం. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే నడుస్తాయి. ఇప్పటికే 500 బస్సులు వచ్చాయి. మరో 2300 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. వచ్చే డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‍లో ఒక్క డీజిల్ బస్సు లేకుండా అన్నీ ఈవీ ఏసీ బస్సులు వస్తాయి. ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్‌గా మార్చుతాం.' అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa