మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు .. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తాజాగా చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి.. ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా ఉండాలని కోరేందుకు తాను ప్రయత్నిస్తున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం తాను 200 సార్లు ఆయనకు ఫోన్ చేసినట్లు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. తనకు కనీసం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో కేబినెట్ మంత్రిగా చేసినట్లు గుర్తు చేసుకున్న మోత్కుపల్లి నర్సింహులు.. తన జాతి ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్దామంటే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‍కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోత్కుపల్లి నర్సింహులు ఈ వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా సాగిన ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి.. ఆ పోరాటంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరేందుకు తాను ప్రయత్నిస్తే అపాయింట్‍మెంట్ దొరకడం లేదని లేదని తెలిపారు. తమకు 5 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే మాదిగ భవనం నిర్మించుకుంటామని మోత్కుపల్లి వెల్లడించారు.
ఇక ఇటీవల హైదరాబాద్‌లో మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ నిర్వహించిన ధన్యవాదాల సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. సీఎం పిలవడం లేదు కాబట్టి ఆ సమావేశ నిర్వాహాకులు కూడా తనను పిలవలేదేమోనని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి ఎంత కాలం ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటారో తన భుజాన మోస్తామని ఆయనకు చెప్పినట్లు వివరించారు. అయినప్పటికీ తాను ఏం పాపం చేశానో తనకే తెలియదని వందల సార్లు ఫోన్ చేసినప్పటికీ.. తనకు అపాయింట్‍మెంట్ మాత్రం ఇవ్వడం లేదని మోత్కుపల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఇలా చేయడం చాలా బాధాకరమని పేర్కొన్న మోత్కుపల్లి.. రేవంత్ రెడ్డి మాదిగ కులాన్ని పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మాదిగలు పార్లమెంట్‌లో అడుగు పెట్టొద్దన్నట్లు తమ వర్గం వారికి టికెట్లే ఇవ్వలేదని ఆరోపించారు. రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా మాదిగలకు సరైన అవకాశం ఇవ్వకుండా తమను చట్టసభల్లో అడుగే పెట్టొద్దన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వందల కార్పొరేషన్లు వేస్తే అందులో ఒక్కటే మాదిగలకు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుండా.. మనం కలిసి ఉన్నాం, కలిసి ధావత్‌లు చేసుకుందాం అని చెబితే వాటితో ఎవరికి సంతోషమని ఈ సందర్భంగా మోత్కుపల్లి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై తమకు ఎలాంటి కోపం లేదని పేర్కొన్న ఆయన.. తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
మాదిగలు రాజ్యాధికారం కోసం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోత్కుపల్లి పిలుపునిచ్చారు. అందుకోసమే మాదిగ మహాశక్తి (ఎంఎంఎస్) అనే సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. ఎంఎంఎస్ అంటే ఒక రాజకీయ పార్టీ కాదని.. జాతి ప్రయోజనాల కోసం పని చేసే సంస్థ అని స్పష్టం చేశారు. మాదిగల వద్ద రాజకీయంగా ఓట్లు ఉన్నాయని.. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎవరినైనా అధికారంలో ఉంచవచ్చని.. అదే సమయంలో ఎవరినైనా అధికారం నుంచి దించేయవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాదిగ మహాశక్తి డెసిషన్ మేకర్‍గా ఉండబోతోందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాదిగల హక్కులను తీసేసి అందరం కలిసి ఉంటామని అనడం ఏంటని నిలదీశారు. తన జీవితంలో రేవంత్ రెడ్డి చేసిన ఒకే ఒక్క మంచి పని ఎస్సీ వర్గీకరణ అని తెలిపారు. ఈ నిర్ణయంతోనే తనకు రేవంత్ రెడ్డిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుని.. మాదిగ జాతిని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేయడం కోసం ఈ ఎంఎంఎస్ పెట్టానని వెల్లడించారు. తాను రేవంత్ రెడ్డి విషయంలో పాజిటివ్‌గానే ఉన్నానని.. కానీ ఆయనే నెగిటివ్ అయ్యేలా చేసుకుంటున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa