రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సైబర్ నేరాల నెట్‌వర్క్‌ను భగ్నం చేయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ దాడులు చేపట్టారు. సైబర్ మోసాలకు సహకరిస్తున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్‌వర్క్‌లపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొత్తం 512 మంది సిబ్బందితో 137 పోలీసు బృందాలు ఒకేసారి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా 137 బ్యాంక్ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, దేశవ్యాప్తంగా 9,451 సైబర్ నేరాలకు సంబంధం ఉన్న 1,888 అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.100 కోట్ల మేర మోసాలు జరిగినట్లు సైబర్ పోలీసులు వెల్లడించారు.ఈ ఆపరేషన్ సందర్భంగా మొత్తం 549 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అలాగే 626 మంది అనుమానితులను గుర్తించగా, వారిలో 208 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో 15 మంది మహిళలు, 7 మంది విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.వీరు తమ బ్యాంక్ ఖాతాలను సైబర్ ముఠాలకు అద్దెకు ఇచ్చి, ప్రతి లావాదేవీపై సుమారు 5 శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా 208 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్ బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఖాతాలను నిబంధనలకు విరుద్ధంగా తెరవడంలో సహకరించినట్లు ఆరోపణలపై Bank of Maharashtra మరియు *Jubilee Hills Merchant Co‑operative Bank*కు చెందిన కొందరు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలు తెరవడంలో భాగస్వామ్యమయ్యారనే ఆరోపణలపై సంబంధిత బ్యాంక్ అధికారులపై BNS సెక్షన్-112 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa