అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో కరీంనగర్ నగరంలోని మహాశక్తి ఆలయం నుంచి బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కొండగట్టు అంజన్న ఆలయం వరకు మహా పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా కేంద్రమంత్రితో పాటు ఇటీవల జరిగిన కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లు కూడా ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.
బీజేపీ పార్టీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే.. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టుకు పాదయాత్రకు వస్తానని బండి సంజయ్ మొక్కుకున్నారు. ఇక ఈ మొక్కుకు సంబంధించిన విషయాన్ని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తేల్చి చెప్పారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు.. 10 వేల మంది కార్యకర్తలు కూడా బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
అయితే బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్ర పాదయాత్రలో బీజేపీ కార్యకర్తలు, అభిమానాలు, ప్రజలు భారీ ఎత్తున హాజరై ఆయన వెంట నడిచారు. ఈ యాత్ర రామడుగు మండలం కోన్‌రావు పేట వద్దకు రాగానే ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పాదయాత్ర కోన్‌రావు పేట సమీపంలోకి రాగానే.. ఆ వీడియోలను తీసేందుకు బీజేపీ కార్యకర్తలు డ్రోన్‌ను ఎగురవేశారు. అయితే.. ఆ డ్రోన్ నేరుగా వెళ్లి రోడ్డు పక్కనే చెట్టుకు ఉన్న తేనెతుట్టెను తాకడంతో ఒక్కసారిగా తేనెటీగలు వాడిపై దాడి చేశాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర గందరగోళం తలెత్తింది.
తేనెటీగలు కొందరు బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడంతో.. వారికి గాయాలు అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన కేంద్రమంత్రి బండి సంజయ్.. గాయపడిన కార్యకర్తలకు ట్రీట్‌మెంట్ ఇప్పించారు. దీంతో అక్కడి గందరగోళం సద్దుమణిగింది. దీంతో ఆ తర్వాత బండి సంజయ్ మళ్లీ పాదయాత్ర కొనసాగించారు. చివరికి అంజన్న ఆశీర్వాద యాత్ర ఎట్టకేలకు కొండగట్టుకు చేరుకుంది. కేంద్రమంత్రి బండి సంజయ్ సహా బీజేపీ కార్యకర్తలంతా కొండగట్టు అంజన్నను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa