వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారటంతో వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు వస్తాయి. ఈ సమయంలోనే హోలీ జరుపుకుంటారు. కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారుచేసిన సహజ రంగులు కలిపిన నీరు చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. గతంలో మోదుగ పూలు, ఎర్ర మందారం, పసుపు, గోరింటాకుతో రంగులు చేసుకుని హోలీ పండుగ జరుపుకునేవారు. అయితే మార్కెట్లోని రసాయన రంగుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.
హోలీ నాడు తెలుపు రంగు దుస్తులే ధరిస్తారు. హోలీనాడు రాహువు చాలా కోపంగా ఉంటాడట. అందుకే ఆయన కోపాన్ని తప్పించుకోవడానికి తెలుపు దుస్తులు ధరిస్తారని ‘సనాతన ధర్మం’ చెబుతోంది. అంతేకాదు, వసంతంలో వచ్చే ఈ పండగ నాటికి ఎండ తీవ్రత పెరుగుతుంది. దాన్ని తట్టుకునేందుకు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం సంప్రదాయంగా వస్తోంది. పైగా రంగుల పండగ.. వర్ణాలన్నీ దుస్తులపై కనిపించి మురిపిస్తేనేగా సంబరం.