బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. త్వరలోనే కొత్త పద్ధతి అమలులోకి రానుంది. బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లకు ఐరిస్ స్కానింగ్ అమలులోకి వస్తుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ వాణిజ్య బ్యాంకులు ట్రాన్సాక్షన్ల ప్రామాణీకరించడానికి ఐరిస్ స్కాన్ ఉపయోగించే అవకాశాన్ని అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా వారి సీనియర్ సిటిజన్ల కస్టమర్ల కోసం ఈ కొత్త పద్ధతిని అమలులోకి తీసుకురావాలని బ్యాంకులు ఆలోచన చేస్తున్నట్లు ఈ అంశానికి సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం ఐరిస్ స్కాన్ ల అమలుకు సంబంధించి బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇతర వాటాదారులతో చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్ల ట్రాన్సాక్షన్లు జరిపేటప్పుడు వేలి ముద్రలు, బొటనవేలు ముద్రల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సమస్య గత నెలలో జరిగిన సమావేశంలో చర్చించినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. ఐరిస్ స్కాన్ అమలు, సవాళ్ల గురించి తదుపరి చర్చల కోసం రిజర్వ్ బ్యాంకును సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎ.మణిమైఖలై నేతృత్వంలోని బ్యాంకుల అంతర్గత కమిటీ కొన్ని ప్రాథమిక పరిశీలనలు చేసిందని, అవి ప్రస్తుతం చర్చిస్తున్నాయని ఎగ్జిక్యూటివ్ తెలిపారు. అయితే, అమలు సమస్యలు, సైబర్ సెక్యూరిటీ సవాళ్లు ఉన్నాయని, అయితే, ఇప్పటికే ఆధార్ ప్లాట్ ఫామ్ ద్వారా అటువంటి అథెంటికేషన్ అందుబాటులో ఉండడంతో మరిన్ని అనుసంధానాలను అన్వేషించవచ్చని తెలిపారు.
మరోవైపు.. లోన్లు తీసుకునే వారికి ఈ ఐరిస్ స్కాన్ అమలుకు సంబంధించిన సవాళ్లను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కంటి శుక్లం ఆపరేషన్ల వంటి కంటి శస్త్రచిక్తత్సలు చేయించుకున్న సీనియర్ సిటిజన్ల కోసం తిరిగి నమోదు చేసుకోవడం అనే అంశాలను అన్వేషిస్తున్నాయి బ్యాంకు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్‌పూర్ చేసిన 2019 అధ్యయనం కంటి శుక్లం ఆపరేషన్ ఐరిస్ ఆకృతి నమూనాలపై ప్రభావితం చేస్తుందని ఈ సందర్భంగా చర్చించనట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఈ క్రమంలో కంటి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తులకు ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థల విశ్వసనీయత గురించి ఆందోళనలు లేవనెత్తినట్లు చెప్పారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాదిలో బ్యాంక్ మిత్ర ఛానెలల ద్వారా తన కస్టమర్ సర్వీస్ పాయింట్ల వద్ద ఐరిస్ స్కానర్ల అమలు చేసింది. వృద్ధాప్య పింఛనుదారులు, కస్టమర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఓ 70 ఏళ్ల వృద్ధురాలు పింఛను తీసుకునేందుకు బొటనవేలు ముద్రలు, బ్యాంక్ రికార్డుల మధ్య సరిపోలకపోవడంతో ఆమె డబ్బులు పొందలేకపోయిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది.