ఉద్యోగులకు ప్రభుత్వ రంగంలోని వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్, ప్రైవేట్ రంగంలోని వారికి పీఎఫ్, పెన్షన్ వస్తుంది. దీంతో రిటైర్మెంట్ తర్వాత వారి జీవితం సాఫీగా సాగుతుందని చెప్పొచ్చు. కానీ.. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అలాంటి సౌకర్యాలేం ఉండవు. వీరికి కూడా 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో.. కేంద్రం అటల్ పెన్షన్ యోజన పథకం తీసుకొచ్చింది. 2015 బడ్జెట్ సమయంలోనే కేంద్రం ప్రకటించిన 3 సామాజిక భద్రతా పథకాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది. దీంట్లో చేరిన వారు 60 ఏళ్ల తర్వాత వారి పెట్టుబడులకు అనుగుణంగా.. ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందుకుంటారు. ఈ స్కీం కింద ఇప్పటికే 5 కోట్ల మందికిపైగా నమోదు చేసుకున్నారు.
>> 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తులు ఈ స్కీంలో చేరొచ్చు. పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి. 40 సంవత్సరాల్లోపే ఈ స్కీంలో చేరాలి. NPS పరిధిలోకి వచ్చేవారు ఈ స్కీంలో చేరేందుకు అనర్హులు. టాక్స్ పేయర్లకు కూడా ఇందులో చేరేందుకు అర్హత లేదు.
>> దీంట్లో చెల్లించాల్సిన మొత్తం వయసును బట్టి మారుతుంటుంది. చేరే వయసును బట్టి.. చెల్లించే దానిని బట్టి పెన్షన్ రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 5 వేల వరకు వస్తుంది. 18 ఏళ్ల వయసులో చేరే వారు 60 సంవత్సరాలు వచ్చేంతర వరకు అంటే 42 సంవత్సరాలు ఈ స్కీం కింద కాంట్రిబ్యూట్ చేయాలి. 18 సంవత్సరాలకే ఈ స్కీంలో చేరే వారు.. రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 210 చెల్లించాలి. నెలకు రూ. 210 చొప్పున 18 ఏళ్ల నుంచి ఇన్వెస్ట్ చేసే వారికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. 40 ఏళ్ల వయసులో చేరితే 20 ఏళ్ల పాటు కాంట్రిబ్యూట్ చేయాలి. వీరు రూ. 291 నుంచి రూ. 1454 వరకు చెల్లించాలి. ఇక్కడ గరిష్టంగా నెలకు రూ. 1454 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. 5 వేల పెన్షన్ అందుతుంది.
బ్యాంకుకు వెళ్లి నేరుగా అకౌంట్ తెరవొచ్చు. లేదా ఆన్‌లైన్‌లో NSDL వెబ్‌సైట్ ద్వారా కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. చిన్న వయసులోనే ఈ స్కీంలో చేరడం ద్వారా గరిష్ట పెన్షన్ పొందే వీలుంటుంది. ఈ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు రూ. 15 కాగా.. మెయింటెనెన్స్ ఛార్జీలు రూ. 20 లోపే ఉన్నాయి. ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు.