ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం గురించి తెలుసా? ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దేశవ్యాప్తంగా ఎక్కడైనా భూమి కలిగిన రైతులకు పంట సాయం కింద.. వారిని ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం అందిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం రూ. 6 వేలు ఈ స్కీం కింద ఇస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. 3 విడతల్లో ప్రతి 4 నెలలకు ఓసారి కేంద్రం నేరుగా డబ్బుల్ని రైతుల అకౌంట్లలోకి వేస్తుంది. 2019లో ఈ పథకం తీసుకురాగా.. ఇప్పటివరకు మొత్తం 16 విడతల్లో రూ. 2 వేల చొప్పున డబ్బులు విడుదల చేసింది. ఇప్పుడు 17 వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. అర్హులైన ఒక్కో రైతు అకౌంట్లో రూ. 2 వేల చొప్పున పడతాయన్నమాట. ఈ డబ్బులు మే నెల చివర్లో లేదా ఎన్నికల ఫలితాల తర్వాత జూన్ మొదటి వారంలో పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి కచ్చితమైన తేదీ స్పష్టం చేయలేదు కేంద్రం.
అయితే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులు కచ్చితంగా ఈ స్కీం కింద ప్రయోజనాలు పొందాలంటే ఇ-కేవైసీ చేయించుకోవాలి. ఇ-కేవైసీ చేయించుకోని కారణంతో రైతులు ఈ డబ్బులు కూడా పొందలేకపోవచ్చు. ఇ-కేవైసీ అప్డేట్ చేసుకునేందుకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పీఎం కిసాన్ అఫీషియల్ పోర్టల్‌లో ఓటీపీ బేస్డ్ కేవైసీ చేయించుకోవచ్చు. ఇంకా దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా బయోమెట్రిక్ కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యాప్‌తో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏది వీలైతే అది త్వరగా చేసుకోవడం ఉత్తమం. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవచ్చనేది చూద్దాం.
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
పేజీ రైట్ సైడ్‌లో ఫార్మర్స్ కార్నర్‌లో ఇకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
తర్వాతి స్టెప్‌లో మీ ఆధార్ కార్డు నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. సెర్చ్ చేయాలి.
తర్వాత ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే కేవైసీ అప్‌డేట్ అయిపోతుంది.
ఇలా కాకుండా.. ఇంకా మీసేవా, CSC సెంటర్లలో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ, యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఇంకా బ్యాంక్ అకౌంట్ రైతులు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి.