సొంత ఇల్లు, అందులో ఓ కారు ఉండాలనేది సగటు మధ్య తరగతి ప్రజల కల. వారి కలను నిజం చేసేందుకు చాలా కంపెనీలు బడ్జెట్ ధరలో చిన్న కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. అయితే, కుటుంబంలో నలుగురికి మించి ఉన్నప్పుడు చిన్న కార్లలో ప్రయాణం సౌకర్యంగా ఉండదు. అందుకే చాలా మంది 7 సీటర్ కార్ల కోసం చూస్తుంటారు. అయితే, పెద్ద కారు అంటే భారీ బడ్జెట్ అవసరం అవుతుందని వెనకడుగు వేసేవారూ ఉన్నారు. పెద్ద కార్లలో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడం, ఇంజిన్ పరంగా ఇతర కార్ల కంటే భిన్నంగా ఉండడంతోనూ ఈ కార్లకు ఆదరణ లభిస్తోంది. మధ్య తరగతి కుటుంబాలకు సైతం పెద్ద కార్లు అందించేందుకు బడ్జెట్ ధరలోనే 7 సీటర్ మోడళ్లను తీసుకొస్తున్నాయి పలు కంపెనీలు. కేవలం రూ. 7 లక్షలోపే అదిరే ఫీచర్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 7 సీటర్ కార్లు ఓసారి పరిశీలిద్దాం.
మారుతీ సుజుకీ ఈకో
సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా 7 సీటర్ కారును తీసుకొచ్చింది మారుతీ సుజుకీ. అదే మారుతీ సుజుకీ ఈకో దేశంలో ప్రస్తుతం లభిస్తున్న చౌకైన కార్లలో ఇదీ ఒకటిగా చెప్పవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.32 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. మరోవైపు.. ఈ కంపెనీ నుంచి 7 సీటర్ ఎర్టిగా కారు మంచి ప్రజాదరణ పొందింది. దాని ధర ఎక్కువగా ఉంటుంది. మారుతీ సుజుకీ ఈకో కారు 1196 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. పెట్రోల్‌తో అయితే 19.71 కిలమీటర్లు, సీఎన్‌జీతో అయితే 26.7 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
రెనో ట్రైబర్
7 సీటర్ సెగ్మెంట్‌లో రెనో ట్రైబర్ కారు మంచి ఆదరణ పొందుతోంది. ఇది మంచి పాకెట్ ఫ్రెండ్లీ ఎంపీవీ కారు అని చెప్పవచ్చు. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.33 లక్షల నుంచి మొదలవుతోంది. ఈ కారు 999 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో వస్తోంది. లీటర్ పెట్రోలుకు 20 కిలోమీటర్లు మైలేజీ అందిస్తోంది. ఇందులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, సెంటర్ కన్సోల్ లాంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 7 సీటర్ కార్లలో మారుతీ సుజుకీ ఎర్టిగాకు మంచి డిమాండ్ ఉంది. ఇది అత్యధికంగా అమ్ముడవుతోంది. అయితే దీని ప్రారంభ ధర రూ. 8 లక్షలకుపైగానే ఉంటుంది. అదే విధంగా కియా కారెన్స్, మారుతి ఎక్స్ఎల్6, బొలెరో నియో ప్లస్, మహీంద్రా బొలెరో కూడా 7 సీటర్ విభాగంలో మంచి ఆదరణ పొందుతున్నాయి.