భారత స్టాక్ మార్కెట్ సూచీలు ప్రస్తుతం దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. వరుస సెషన్లలో భారీగా పెరుగుకుంటూ జీవన కాల గరిష్టాల్ని నమోదు చేశాయి. శుక్రవారం సెషన్లోనే సెన్సెక్స్, నిఫ్టీ 52 వారాల గరిష్ట విలువ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1600 పాయింట్లకుపైగా పెరిగి 76,700 మార్కు ఎగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 1700 పాయింట్లకుపైగా పెరిగి 76,795.31 వద్ద సెన్సెక్స్ ఆల్ టైమ్ హై వాల్యూ నమోదు చేసింది. నిఫ్టీ కూడా 450 పాయింట్లకుపైగా లాభంతో 23 వేల 300 లెవెల్స్‌లో ఉంది.
అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగు దేశం పార్టీతో సంబంధం ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ దూసుకెళ్తోంది. పార్టీ ఫౌండర్ నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికే ఈ స్టాక్. స్టాక్ మార్కెట్ల లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఈ స్టాక్ వరుసగా అప్పర్ సర్క్యూట్లు కొట్టింది. ఒకరోజు 20 శాతం, మళ్లీ వరుసగా రెండు రోజులు 10 శాతం చొప్పున పెరిగింది. ఇవాళ కూడా 10 శాతం అప్పర్ సర్క్యూట్‌తో 661.25 వద్ద జీవన కాల గరిష్ట విలువను నమోదు చేసింది. దీంతో మార్కెట్ విలువ కూడా రూ. 6.14 వేల కోట్లకు చేరింది.
ఈ కంపెనీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రమోటర్ హోదాలో ఉన్న ఆమెకు 2024 జనవరి- మార్చి త్రైమాసికం వివరాల ప్రకారం కంపెనీలో 24.37 శాతం వాటా ఉంది. ఈ లెక్కన ఆమెకు మొత్తం హెరిటేజ్ ఫుడ్స్‌లో 2,26,11,525 షేర్లు ఉన్నాయి. ఇంకా నారా చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
2024, మే 31న ఈ స్టా్క్ రూ. 402.90 వద్ద సెషన్ ముగించింది. ప్రస్తుతం రూ. 661.25 తో పోలిస్తే ఏకంగా ఒక్కో షేరుపై రూ. 259 పెరిగింది. దీంతో నారా భువనేశ్వరి మొత్తం షేర్లపై ఈ 5 రోజుల్లోనే ఆమె సంపద 2,26,11,525 x 259 = 585,63,84,975 పెరిగింది. అంటే 5 రోజుల్లోనే ఏకంగా రూ. 585 కోట్ల లాభం పొందడం విశేషం. టీడీపీతో సంబంధం ఉన్న మరో స్టాక్ అమర్ రాజా ఎనర్జీ షేరు కూడా వరుసగా అప్పర్ సర్క్యూట్లు కొడుతోంది.