తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలు సహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దశ తిరిగిందని చెప్పొచ్చు. ఆయన మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కుటుంబంలో ఈ ఆనందం ఒకవైపు ఉండగా.. ఆర్థికంగా కూడా దూసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ దూసుకెళ్తుండటమే దీనికి కారణం. ఈ స్టాక్ వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్లు కొడుతూనే ఉంది. దీంతో ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన మదుపరులకు మాత్రమే కాదు.. కంపెనీలో వాటాలు ఉన్న నారా ఫ్యామిలీకి కూడా సంపద భారీగానే వస్తుంది.
కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. కూటమిలో రెండో పెద్ద పార్టీ ఇదే. వీరి మద్దతుతోనే కేంద్రంలో మోదీ సర్కార్ మరోసారి అధికారం చేపట్టిందని చెప్పొచ్చు. మరోవైపు రాష్ట్రంలో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ సానుకూలతల నడుమ స్టాక్ పెరుగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి షేరు దూసుకెళ్తూనే ఉంది.
గత 12 సెషన్లలో చూసుకుంటే ఈ స్టాక్ ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసింది. అంటే స్టాక్ ధర కూడా డబుల్ అయిందన్నమాట. ఇక హెరిటేజ్ కంపెనీలో నారా చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉంది. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరికి 24.37 శాతం వాటా కింద 2,26,11,525 షేర్లు ఉన్నాయి. ఈమె కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఇంకా ఎండీగా ఉన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు 1,00,37,453 (10.82 శాతం వాటా) షేర్లు ఉన్నాయి. నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణికి 4,30,952 షేర్లు (0.46 శాతం వాటా) ఉండగా.. వీరి కుమారుడు, చంద్రబాబు మనవడు 9 సంవత్సరాల నారా దేవాన్ష్‌కు కూడా హెరిటేజ్ కంపెనీలో 56,075 షేర్లు (0.06 శాతం వాటా) ఉండటం విశేషం. వీరంతా ప్రమోటర్ గ్రూప్ కిందికి వస్తారు.
ఇక ఈ స్టాక్ గత 6 ట్రేడింగ్ సెషన్లలో 70 శాతం పెరిగింది. దీంతో దేవాన్ష్ షేర్లు మొత్తం 56,075 కాగా.. వీటి ద్వారా ఆయన మొత్తం సంపద జూన్ 3న రూ. 2.4 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు అది రూ. 4.1 కోట్లకు పెరిగింది. అంటే 6 సెషన్లలో దేవాన్ష్‌కు రూ. 1.7 కోట్లు లాభం వచ్చిందన్నమాట. ఇదే క్రమంలో 6 సెషన్లలో చంద్రబాబు కుటుంబం మొత్తానికి చూసుకుంటే రూ. 1100 కోట్ల మేర సంపద పెరిగింది. ఇవాళ హెరిటేజ్ షేరు ఇంట్రాడేలో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ. 727.35 ను తాకింది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కోసం ఇన్వెస్టర్లు చూడగా ఇప్పుడు షేరు ధర రూ. 700 లెవెల్స్‌లో కొనసాగుతోంది.