ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ త్వరలోనే రానుంది. మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు ఓలాకు మార్గం సుగమమైంది. ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తాజాగా ప్రకటించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా మొత్తంగా రూ.7,250 కోట్లను సమీకరించనుంది ఓలా ఎలక్ట్రిక్. అలాగే సెబీ నుంచి ఐపీఓ కోసం అనుమతి పొందిన తొలి ఈకవీ స్టార్టప్ కంపెనీ సైతం ఓలానే కావడం గమనార్హం.
ఐపీఓ కోసం సెబీకి ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది 2023, డిసెంబర్‌లోనే దరఖాస్తు చేస్కున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పబ్లిక్ ఇష్యూకు సెబీ నుంచి ఆమోదం లభించింది. ఐపీఓలో భాగంగా ఫ్రెష్ షేర్ల జారీ ద్వారా రూ. 5,500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 95.19 మిలియన్ షేర్లను విక్రయించనుంది ఓలా. వీటి విలువ రూ. 1,750 కోట్లుగా ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవీశ్ అగర్వాల్ 47.3 మిలియన్ షేర్లను, అలాగే ఈ స్టార్టప్ సంస్థ ప్రారంభంలో పెట్టుబడులు పెట్టిన ఆల్ఫావేవ్, ఆల్ఫైన్, డీఐజీ ఇన్వెస్ట్‌మెంట్, మ్యాట్రిక్స్ 47.89 మిలియన్ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించనున్నాయి.
మరోవైపు.. రూ.1,100 కోట్లు విలువైన షేర్ల రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ను సైతం సంస్థ పరిశీలిస్తోంది. ఇదే జరిగితే ఆ మేరకు తాజా పబ్లిక్ ఇష్యూ సైజ్ తగ్గుతుంది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులను క్యాపెక్స్, అప్పులు చెల్లించేందుకు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించనుంది. రూ.7 వేల కోట్లలో రూ.1,226 కోట్లు క్యాపెక్స్ కోసం, రూ.800 కోట్లు అప్పులు చెల్లించేందు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే రీసర్ట్ అండ్ డెవలప్మెంట్ కోసం రూ.1600 కోట్లు వెచ్చించనుంది. అలాగే సంస్థ క్యాబ్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులతో ప్రాథమిక చర్చలు ప్రారంభించిన సమయంలో సెబీ నుంచి ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు ఆమోదం లభించడం గమనార్హం.